(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తోంది. పల్లెపల్లెనూ ఒకసారి చుట్టుముట్టిన కరోనా ఇంకా తన దాహం తీరలేదన్నట్టుగా రెండో విడత ప్రయాణం కూడా ప్రారంభించింది. అయినప్పటికీ విజయనగరం జిల్లాలోని ఆ నాలుగు పల్లెలను ఇంతవరకూ కరోనా టచ్ చేయలేదు. ఆ పల్లెలు కరోనాకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయి. నమ్మశక్యంగా లేదా! అందరికీ ఆశ్చర్యం కలిగించే ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకోండి మరి!!
మన దేశంలో మార్చి నెల తొలివారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశాల్లో వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఆ నాలుగు పల్లెల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలా అని ఆ గ్రామాల్లో ప్రజలు మాస్కులు వాడతారనో, శానిటైజర్లను వినియోగిస్తారనో అనుకుంటే మాత్రం పొరపాటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలోని తూర్పు కనుమల్లో ఒడిశా సరిహద్దు పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయగడ జమ్ము, పల్లం బరిడి, సంతోషపురం, మోరంగూడ గ్రామాలకు నేటికీ కరోనా తాకలేదు. ఆ గ్రామస్థులు ఇప్పటికీ ఎటువంటి కరోనా నిబంధనలనూ పాటించకుండ సాధారణ జీవనం గడుపుతున్నారు.
దంపుడు బియ్యమే ..
బయో గ్రామాలుగా పేరు తెచ్చుకున్న ఈ నాలుగు గ్రామాల్లో రసాయన ఎరువులను వినియోగించకుండానే పంటలను పండిస్తారు. ఇక్కడ ఇప్పటికీ దంపుడు బియ్యాన్నే తింటారు. పని చేసిన తరువాత చేతులను వేపాకుతో శుభ్రం చేసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. అవసరం అనుకుంటే చేతులు శుభ్రపరిచేందుకు అప్పుడప్పుడూ జీలుగ కళ్లు ఉపయోగిస్తారు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడకనే వెళతారు. ఈ నాలుగు గ్రామాల్లో 8,557 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గడిచిన ఎనిమిది నెలల్లో ఈ పల్లెల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొవిడ్ కేసు నమోదు కాకపోవడంతో వైద్యవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
సాధారణ జీవనమే ..
ఈ గ్రామాల్లో చాలా ఇళ్ల ముందు వెదురుతో కట్టిన దడిలు, ఇంటి వెనుక జీలుగ చెట్లు, ఆరుబయట అరుగుల ముందు పెద్ద రాతి రుబ్బురోళ్లు, తిరగళ్లు, పచ్చళ్లు నూరే రాళ్లు దర్శనమిస్తాయి. గ్రామస్థులు పలుగు, పారలు పట్టుకుని పొలాలకు వెళ్తూ సాధారణ జీవనాన్ని గడుపుతారు. ఇక్కడ వరి, పసుపు, రాగులు, సజ్జలు, జీడిమామిడి, జామ, పనస ప్రధాన పంటలు. ప్రతి ఇంటి పెరట్లో కూరగాయలు పండిస్తారు. కాయకష్టంతో వీరంతా జీవనం సాగిస్తుండటం వల్ల శరీర పటుత్వంతో పాటు, రోగనిరోధక శక్తి కూడా పెరిగి ఎలాంటి వైరస్‌లనైనా తట్టుకునే స్వభావం వీరికి వచ్చినట్లు స్వచ్ఛందసంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేలతో స్పష్టం చేశాయి. అందుకే వీరి దరికి కరోనా చేరలేదని భావిస్తున్నాయి.
Must Read ;- సెల్యూట్ విజయనగరం పోలీస్.. పోగొట్టుకున్న డబ్బు బాధితునికి అందజేత