దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, కుమార్తెలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టేశారు. గురువారం వైఎస్సార్ 12 వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ సీఎంగా ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన ఆయన కుమార్తె వైఎస్ షర్మిలలు కలిసికట్టుగా నివాళి అర్పించారు. మునుపటి మాదిరిగానే వైఎస్సార్ సమాధి వద్ద అన్నాచెల్లి పక్కపక్కనే కూర్చోగా.. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆ పక్కగా కూర్చున్నారు. నిన్న రాత్రే ఇడుపులపాయ చేరుకున్న జగన్, షర్మిలలు అక్కడి గెస్ట్ హౌస్ లోనే బస చేశారు. ఉదయమే తల్లితో పాటు కలిసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న వారిద్దరూ తమ తండ్రికి నివాళి అర్పించారు.
వైఎస్సార్టీపీతో విభేదాలు
మొన్నటిదాకా జగన్, షర్మిల మధ్య మంచి అవినావాభావమే కొనసాగింది. అయితే ఎలాగూ తనకు వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న భావనతో తన మెట్టినిల్లు అయిన తెలంగాణకు షిప్ట్ అయిపోయిన షర్మిల.. వైఎస్సార్టీపీ పేరిట కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయంలో జగన్, షర్మిలల మధ్య విభేదాలు పొడచూపాయి. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా కలిసి తండ్రికి నివాళి అర్పించేందుకు కూడా వారు సిద్ధపడలేదు. షర్మిల పొద్దన్నే నివాళి అర్పించి హైదరాబాద్ బయలుదేరిపోగా.. ఆమె వెళ్లిన తర్వాత సాయంత్రానికి గాని జగన్ ఇడుపులపాయ రాలేదు. ఒకరికొకరు ఎదురుపడరాదన్న భావనతోనే వారు ఇలా వేర్వేరుగా తండ్రికి నివాళి అర్పించారన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు తమ తండ్రి వర్ధంతి సందర్భంగా గతంలో మాదిరిగా కలిసే తండ్రికి నివాళి అర్పించిన జగన్, షర్మిల తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న మాటను చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తండ్రి జ్ఞపకాల్లో..
ఇదిలా ఉంటే.. తమ తండ్రిని గుర్తు చేసుకుని జగన్ తో పాటు షర్మిల కూడా బాధపడ్డారు. ఈ మేరకు ముందుగా జగన్ ఓ ట్వీట్ చేస్తే.. ఆ తర్వాత షర్మిల కూడా మరో ట్వీట్ చేశారు. ‘‘తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారు. వారి హృదయాల్లో కొలువై ఉన్నారు. నా ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక షర్మిల తన ట్వీట్ లో ఏమన్నారంటే.. ‘‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది. ఐ లవ్, అండ్ మిస్ యూ డ్యాడ్’ అని షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.











