దేశ రాజకీయాలను మలుపు తిప్పిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు రాజకీయ నేత అవతారం ఎత్తేందుకు తహతహలాడుతున్నట్టుగానే కనిపిస్తోంది. గతంలో తన వ్యూహాలతోనే ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీని ఇప్పుడు అదే పదవి నుంచి దించే దిశగా ఇటీవలి కాలంలో పీకే తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొత్త కూటమి జతకూడే దిశగా తనదైన శైలి మంతనాలు సాగిస్తున్న పీకే.. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ సహా ఎన్సీపీ, తృణమూల్ పార్టీల హైకమాండ్ లతో భేటీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని స్వయంగానే బరిలోకి దిగితే ఎలాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ఈ దిశగా పీకే నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వద్దంటోందా?
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఆసక్తి చూపుతుంటే.. ఆయనకు రెడ్ కార్పెట్ పరవాల్సిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందట. ప్రశాంత్ కిశోర్ చేరికకు సంబంధించి పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే అధినేత్రి సోనియాగాంధీతో చర్చించారని, త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం ఆహ్వానిస్తున్నారు. పీకే చేరికతో కాంగ్రెస్‌కు మేలే జరుగుతుందని ఓ వర్గం చెబుతుంటే.. మరోవర్గం మాత్రం ఆచితూచి అడుగేయాల్సిందేనని చెబుతోందట. ఇలా పీకే ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వర్గంలో.. పార్టీ వైఖరిని విమర్శిస్తూ గతంలో సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలు ఉన్నారట. పీకేను పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయంలో త్వరలోనే సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
నితీశ్ అనుభవం గుర్తుకొస్తోందా?
ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్ నిత్యం రాజకీయ నేతలతో భేటీలు వేస్తూ.. వారి డాబూ దర్పం చూసి బోల్తా పడ్డారో, ఏమో తెలియదు గానీ.. తన సొంత రాష్ట్రం బీహారలోని అధికార పార్టీ జేడీయూలో చేరిపోయారు. పీకేకు నిజంగానే రెడ్ కార్పెట్ పరిచినంత పనిచేసిన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే అప్పటిదాకా బీజేపీకి దూరంగా ఉండిపోయిన జేడీయూ.. పీకే చేరిక తర్వాత తన వైఖరి మార్చుకుంది. దీంతో అప్పటికే మోదీ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సాగిన పీకేకు నితీశ్ కొత్త బాట నచ్చలేదు. దీంతో నితీశ్ తో విభేదించిన పీకే.. జేడీయూకు అనతి కాలంలోనే రాజీనామా చేసేశారు. ఇప్పుడు పీకే ఎంట్రీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. మరి కోరి మరీ వస్తున్న పీకేకు కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందో.. లేదంటే వ్యూహాలు రచిస్తే చాల్లేమ్మంటూ ఆయన ముఖం మీదే చెప్పేస్తుందో చూడాలి.