అ, ఆ.. ఈ రెండు పేర్లలోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ అక్షరాల్లోని మర్మం తెలుసుకోవాలన్న కుతూహలం ఉందా? అ అంటే అఖండ, ఆ అంటే ఆచార్య.. ఒక సినిమాలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరో, ఇంకో సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో.
ఈ సినిమా పేర్లలోని సాన్నిహిత్యమే గానీ ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు కలిసి నటించలేదు. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. తెలుగు సినిమా రంగంలో నంబర్ వన్ స్థానాలను ఆక్రమించిన నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య ఇటీవలి కాలంలో సాన్నిహిత్యం పెరిగింది. నందమూరి కుటుంబంలో మూడో తరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్, మెగా వారసుడు రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ మూవీలో కలిసి నటించారు. ఒకప్పుడు మహానటులు ఎన్టీఆర్ ఏయన్నార్ ల మధ్య ఎంత పోటీ ఉన్నా ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించారు. అలాగే కృష్ణ, శోభన్ బాబు కూడా.
ఎన్టీఆర్– కృష్ణ, ఏయన్నార్-కృష్ణ కూడా కలసి సినిమాలు చేశారు. అలాంటిది ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు తగ్గిపోయాయి. ట్రిపుల్ ఆర్ తో మళ్లీ కొత్త ఊపు కనిపిస్తోంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే అఖండ, ఆచార్య కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మహానటుడు ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సమయంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన తిరుగులేని మనిషి చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి నటించారు. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు.
చిరంజీవి కన్నా వయసులో బాలయ్య కాస్త చిన్న అయినా ఇద్దరూ సమకాలికులే. ఇద్దరి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీ అన్న సందర్భాలు ఉన్నాయి. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. మెగాస్టార్ ఆచార్య వచ్చే ఫిబ్రవరిలో విడుదలవుతోంది. చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దూకుడు పెంచారు. అఖండ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే బాక్సాఫీసులో ప్రకంపనాలు పుట్టిస్తోంది. వీరిద్దరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఇద్దరూ కలిసి ఒకే తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పాత రికార్డులన్నీ బద్దలు కావలసిందేనేమో. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చ నీయాంశం ఇదే. వీరిద్దరి సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తే ఇంకెలా ఉంటుందో కదూ. ఆ ప్రయత్నాలు ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. చిరంజీవి హీరోగా సినిమా చేయాలని బోయపాటికీ, బోయపాటి సినిమాలో నటించాన్న కోరిక మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది. ఈ సినిమా పట్టాలెక్కాలంటే అది ఒక్క బోయపాటి తలుచుకుంటేనే సాధ్యమవుతుంది.
మరి అలాంటి కథ కూడా దొరకాలిగా. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్టు కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. దీని మీద మైత్రీ నిర్మాతలు కూడా స్పందించారు. అలాంటి అవకాశమే మాకు వస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది అని వారంటున్నారు. చకచకా సినిమాలు చేసేస్తున్న చిరంజీవి వాటిని పూర్తి చేసేయడం, బాలయ్య మలినేని సినిమా పూర్తిచేసేయడం జరిగాక ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్











