రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేనియా మామూలుగా లేదు. నిన్న విడుదలైన ట్రైలర్ అన్ని భాషల్లోనూ రికార్డులు బద్దలుకొట్టింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా చెలరేగిపోయారు. అందుకేనేమో చూసిన వారే మళ్లీ మళ్లీ ఈ ట్రైలర్ చూస్తున్నారు. వచ్చే జనవరి 7న ఈ సినిమా విడుదల కానున్నా ముందే రికార్డులు బద్దలుకొడుతోంది. నిన్న థియేటర్లలోనూ, యూట్యూబ్ లోనూ ఈ ట్రైలర్ విడుదలైంది. 24 గంటల వ్యవధిలో 51 మిలియన్ల వ్యూస్ ను ఈ ట్రైలర్ కొల్లగొట్టింది.
మొత్తం 5 భాషల్లో ట్రైలర్ విడుదలైంది. భారీ తారాగణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒకప్పుడు బాహుబలి పేరుతో ఉండే రికార్డును ఈ ట్రైలర్ బద్దలు కొట్టేస్తోంది. 24 గంటల వ్యవధిలో ట్రైలర్ హిందీ వెర్షన్ 23.9 మిలియన్, తెలుగు వెర్షన్ 22.2 మిలియన్, కన్నడ వెర్షన్ 5.5 మిలియన్, తమిళ వెర్షన్ 3.6 మిలియన్, మలయాళ వెర్షన్ 2.5 మిలియన్ వ్యూస్ ను సాధించాయి. ముఖ్యంగా మాస్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరణ్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందింది. దీనికి రాజమౌళి స్క్రిప్టు తోడైతే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. సినిమా నిడివి 186 నిమిషాలు ఉంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ట్రైలర్ ను చూసి ఇతర హీరోలు సైతం అద్భుతమంటూ కామెంట్లు చేస్తున్నారు.











