ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుందా? ఉండదా?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఇప్పట్లో లేనట్లే. కేజీఎఫ్ తరహాలో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీరిద్దరి కాంబినేషన్ రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఇటీవలే దీనిపై వివరణ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో తమ ప్రాజెక్టు ఏదీ లేదని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ పూర్తిచేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇది పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సినిమా పూర్తయ్యాక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఆయన దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు ముస్తాబవుతోంది. ప్రభాస్ హీరోగా ‘సలార్’ సెట్స్ పై ఉంది. సలార్ పూర్తయ్యాక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కు ఇది 31వ సినిమా అవుతుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పూర్తిచేసుకుని ప్రశాంత్ నీల్ సెట్ప్ పైకి వెళతారు. కాబట్టి రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు.
ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందే సినిమా పాన్ ఇండియా కేటగిరీలోకి వస్తుంది. ఈ సినిమా పరిధి పెద్దదని ఎన్ఠీఆర్ ఇటీవలే చెప్పారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందట. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటున్నారు దీన్ని. ఇది వచ్చే ఏడాది అక్టోబరులో ప్రారంభమవుతుంది. ఇదంతా చూసినప్పుడు రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా అది 2023 లేదా 2024లోనే సాధ్యమవుతుంది.











