నారా ఫ్యామిలీకి అండగా నందమూరి ఫ్యామిలీ నిలబడింది. నిన్న అసెంబ్లీ సాక్షిగా సాగిన దుర్వినీతి పర్వాన్ని నిలదీసింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించింది.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావ మరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, మహానటుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే కూడా అయిన బాలకృష్ణ మాట్లాడుతూ అది అసెంబ్లీనా గొడ్డ చావిడా అని వ్యాఖ్యానించారు. ‘అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. ఏపీలో దోచుకున్న సొమ్ము ఇంట్లో దాచుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి లేదు. కొత్త నీచపు సంస్కృతికి వారు తెరలేపారు.. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది.
అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తెచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగోలేదు ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక.. మళ్లీ ఇలాంటి నీచనికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్.. భరతం పడతాం.
ప్రతి విషయానికీ హద్దు ఉండాలి. ఆడవాళ్ల జోలికొస్తే చెతులు ముడుచుకొని కూర్చోం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై దాడులకు యత్నించినా ఓర్పుతో ఉన్నాం. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు’అని బాలయ్య హెచ్చరించారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనై కళ్యనీళ్లపర్యంతమయ్యారు. ‘హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. మీ ఇంట్లో కూడా పెళ్లాలు ఉన్నారు.. ఆడపిల్లలు ఉన్నారు. దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీద రాళ్లు వేస్తున్నారు. రాజకీయపరంగా ఉంటే చూసుకోండి.
పర్సనల్ గా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ ఎరగం. మాకో క్రమశిక్షణ ఉంది. పాటిస్తున్నాం. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదని కోరుతున్నాం.. జాగ్రత్త’ అని రామకృష్ణ హెచ్చరించారు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి మాట్లాడుతూ ‘వాళ్లిద్దరి బాధ చూడలేకపోతున్నాం. మాలో కూడా రామారావుగారి బ్లడ్, బాలకృష్ణ గారి బ్లడ్ ఉంది. ఇలాంటివి మళ్లీ రిపీట్ అవకుండా ఉంటే మంచింది’ అన్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ ‘ఇవాళ చాలా బాధాకరమైన రోజు. మా అత్తగారు భువనేశ్వరిగారి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం బాధగా ఉంది. ఆమె పాలిటిక్స్ లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు.
ఇంకొకరి పర్సనల్ విషయాలు ఏ రోజూ మాట్లాడలేదు. తెలుగు ప్రజలు అన్నా అని ఎన్టీఆర్ గారిని పిలుస్తుంటారు. అలాంటి ఆయన ఇంటి ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటం బాధాకరం. కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడకూడదు. మనలో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు.. కుటుంబ సభ్యుల్ని రాజకీయంలోకి తీసుకురాకూడదు. తెలుగు వారంతా ఖండించాల్సిన రోజిది. ఎన్టీఆర్ కూతురి గురించి ఇలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది’ అన్నారు. నందమూరి చైతన్యకృష్ణ మాట్లాడుతూ ‘ చంద్రబాబు మావయ్య అప్ సెట్ అయ్యారు. నాకే బాధేసింది. వల్లభనేని వంశీ, కొడాలి నాని మా అత్త గురించి వారి రాజకీయ లబ్ది కోసం మా అత్తను బలి పశువును చేస్తున్నారు.
మా అత్త గురించి గానీ మా పెద్దత్త, లోకేశ్వరి, ఉమామహేశ్వరిల గురించి మీకేం తెలుసు. మా తాత చాలా మమ్మల్ని పద్దతిగా పెంచారు. ఆ కట్టుబొట్టు,, ఆ విలువలు నేర్పించారు. వీళ్లని చూసి మేం నేర్చుకున్నాం. సంప్రదాయబద్దంగా ఉంటారు. పద్దతిగా పెంచారు. మా నాయనమ్మ బసవతారకం కూడా అందరినీ పద్దతిగా పెంచారు. మా అక్కల్ని చూసి మేం నేర్చుకున్నాం. వారి మెడలో నగలు కూడా ఏమీ ఉండవు. ఎవరు వచ్చినా మర్యాదగా మాట్లాడాతారు. భువనేశ్వరిగారిని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారు. రాజకీయ లబ్దికోసం ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. మా తాతగారు మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వరకట్నం మీద ఆయన సినిమా కూడా చేశారు. కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు తీశారు. ఆడవాళ్లని వెన్నుతట్టి ప్రోత్సహించారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ఇలా మీరు మాట్లాడితే రాజకీయాల్లోకి ఏ మహిళ వస్తుంది? మహిళల కోసం చంద్రబాబు డ్వాక్రా తీసుకొచ్చారు. మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించారు. మా బాబాయ్ హరికృష్ణ మహిళలకోసం ఆర్టీసీలో రిజర్వేషన్ కల్పించారు. అంబటి రాంబాబు మీకి బావ్యం కాదు దీనిపై ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఓ ప్రకటన చేయాలి. వీళ్లని బర్తరఫ్ చేయాలి. వీళ్లకి మంత్రులుగా చేసే అర్హత లేదు. మీరు కూడా క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండు చేశారు. నందమూరి వసుంధర, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు.











