ఏపీ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకూ మధ్య ఉన్న గ్యాప్ తొలిగిపోయినట్టే భావించాలేమో. సినిమా టిక్కెట్ల ధరలు పెంచాలన్న డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి రెండు మూడు సార్లు స్పందించారు. ఓ అవార్డుల ఫంక్షన్ లో దీని మీద సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం ఆన్ టిక్కెటింగ్ విధానాన్ని ప్రకటించినప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అసంతృప్తిని వ్యక్తంచేశారు. టిక్కెట్ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దానికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతానని హామీ ఇచ్చారు.
అయితే సినీ పరిశ్రమ కోరినంత రేట్లు పెంచలేదుగానీ కొంతవరకు వారిని సంతృప్తి పరచగలిగారు. సినిమా టికెట్ల కొత్త రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్ణయించారు. సవరించిన ధరల ప్రకారం.. అత్యంత కనిష్ట ధర రూ. 5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. కాకపోతే ఇక నుంచి మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఉండేలా లేదు. ప్రత్యేక సందర్భాలలో మాత్రం అనుమతించే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఈ రోజు నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి. అంతా బాగానే ఉందిగానీ గ్రామ పంచాయితీ ప్రాంతాల్లో నేల టిక్కెట్ ధర ఐదు రూపాయలే. అంటే రోడ్డు మీద టీ తాగడానికి అయ్యే ఖర్చులో సగం. దీన్ని మాత్రం అందరూ విమర్శిస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..
మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీ ప్రాంతాల్లో..
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో..
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో..
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5
టికెట్ల అంశంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు
ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజా టికెట్ల ధరలు కూడా వెల్లడయ్యాయి. గతంతో పోల్చితే సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. టికెట్ల అంశంపై తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిపై ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు 45 ఏళ్ల అనుభవం ఉందని, దర్శకుడిగానూ, నిర్మాతగానూ తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుత టికెట్ల విధానంతో చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతిని ప్రేక్షకుడు టీవీలో ఎప్పటికీ పొందలేడని తెలిపారు.
ప్రదర్శనల సంఖ్య తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని వివరించారు. ఆన్ లైన్ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలుచుకుంటే టికెట్ రూ.300 కాదు రూ.500 పెట్టి అయినా చూస్తాడని, అదే అతనికి నచ్చని సినిమాను టికెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు. పైగా ఆన్ లైన్ విధానంలో చాలామంది టికెట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, అదే ఆన్ లైన్ లో రేట్లు పెంచి టికెట్లు అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుందని వెల్లడించారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Must Read ;- బన్నీ ‘పుష్ప’ ఫంక్షన్ కి ప్రభాస్ వస్తున్నాడా?











