పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై మండలిలో జరిగిన చర్చ సభ్యులు భూతులు తిట్టుకునేందుకు వేదికగా మారింది. దుర్గగుడి రథంపై మాయమైన మూడు వెండి సింహాలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో ఉన్నాయంటూ మా సభ్యులు బుద్దా వెంకన్న అంటున్నారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సభలో గుర్తుచేశారు. దీంతో మంత్రి వెల్లంపల్లి భూతుపురాణం అందుకున్నారు. మండలిలో ఇవాళ పంచాయతీ రాజ్ చట్ట సవరణ పై చర్చ జరుగుతుండగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వైకల్యాన్ని హేళన చేస్తూ, ఓరేయ్ కూర్చో అంటూ రన్నింగ్ కామెంట్ చేస్తూ పెద్దల సభ పరువు తీశారని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంధ్రప్రసాద్ కు మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
పక్కదారి పట్టించేందుకేనా?
అవసరం లేకపోయినా మంత్రులంతా మండలికి వచ్చి సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ సభలో గందరగోళం చేస్తున్నారని అశోక్ బాబు తెలిపారు. మంత్రి వెల్లంపల్లిపై మానవహక్కుల సంఘం, స్పీకర్, మండలి చైర్మన్ కి కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండలిలో మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. మీడియా సెంటర్ కావాలని అడిగితే దానికి కూడా సంబంధంలేని కారణాలు చెబుతున్నారని అశోక్ బాబు తెలిపారు. మంత్రి వెల్లంపల్లి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కు క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. సభ అదుపు తప్పడంతో ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.











