గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే క్యూలైన్లో నిలబడి ఉన్నారో వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో పోలింగ్ దారుణంగా నమోదైంది. పోలీసులను, ఈసీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు దిగారు. అయితే వారికి నిమ్మరసం ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దీక్ష విరమింప చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రేటర్ ఎన్నికలపై చర్చ జరుగుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘాన్ని, పోలీసులను సీఎం చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. పోలింగ్ శాతం తగ్గడానికి సీఎం, పోలీసులు, ఈసీనే కారణమని ఆయన ఆరోపించారు. పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన వారే భయబ్రాంతులకు గురిచేసి పోలింగ్ తగ్గేలా చేశారని విమర్శించారు. సీఎం కనుసన్నల్లో ఎన్నికలు జరిగాయని, తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం భయానక పరిస్థితులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని బండి సంజయ్ తెలిపారు.
Must Read: గ్రేటర్ ఉత్సాహం.. తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్లాన్











