బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో స్పష్టత వచ్చేసింది. కాకపోతే సీబీఐ ఏం తేల్చబోతుందన్నది చూడాలి. సుశాంత్ ది హత్య కాదు ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చింది.
తమ నివేదికను కూడా సీబీఐకి అందజేసింది. సుశాంత్ ను గొంతు పిసికి చంపారన్నది అతని కుటుంబ సభ్యుల వాదన. వీటిని ఈ వైద్య బృందం తోసిపుచ్చింది. జూన్ 14వ తేదీన సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శవపరీక్షఆధారంగా దీన్ని ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసుపై అనేక అనుమానాలు తలెత్తడంలో చివరికి దీని దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.
ఆ తర్వాత సుశాంత్ ప్రియురాలిని విచారించడం, ఇందులో డ్రగ్స్ పాత్ర కూడా ఉండటంతో మరో కోణం కదిలింది. ఒక దశలో డ్రగ్స్ అంశం బాగా తెరపైకి రావడంతో సుశాంత్ మృతి కేసు పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వచ్చాయి. తాజా పరిణామాలు ఏమిటంటే ఎయిమ్స్ వైద్యుల బృందం మళ్లీ పరీక్షలు జరిపి ఆత్మహత్యగానే నిర్ధరించింది. దాంతో ఈ కేసు ఇక సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది అనే కోణంలోనే దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముంబయి ఆస్పత్రి జరిపిన శవపరీక్షలో ఎలాంటి రిపోర్ట్ వచ్చిందో దాన్నే ఎయిమ్స్ కూడా ధ్రువీకరించింది.
ఈ నివేదికలో కూడా ఏవైనా లోపాలు ఉన్నట్లనిపిస్తే సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (సి.ఎఫ్.ఎస్.ఎల్) కూడా దీన్ని పరిశీలించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఇంకా ఏవైనా ఆధారాలు దొరికితే తప్ప దీన్ని సెక్షన్ 302లో చేర్చే అవకాశం లేదు. ఇప్పటిదాకా వేరే ఆధారాలు ఏమీ దొరకలేదు. సుశాంత్ ను మానసికంగా వేధించారనే కోణంలోనే కేసు దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ కూడా తన 57 రోజుల దర్యాప్తులో 20 మందికి పైగానే ప్రశ్నించింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్‌లు, డిజిటల్ కెమెరా, రెండు మొబైల్ ఫోన్‌లను ఏజెన్సీ ముందస్తుగా పరిశీలించిందని ఆ వర్గాలు తెలిపాయి.
అతని ప్రియురాలు రియా చక్రవర్తి అతన్ని మానసికంగా వేధించిందని ప్రధాన ఆరోపణ. హత్య కోణంతో సహా అన్ని అంశాలనూ పరిశీలిస్తున్నారు. ఇది హత్యకేసు అని నిరూపించే ఆధారాలు తమ వద్ద లేదని సీబీఐ వర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబానికి సంబంధించిన న్యాయవాది ఒకరు గత వారం ఒక ఆరోపణ చేశారు. సుశాంత్ ను గొంతుకోసి చంపినట్లు ఎయిమ్స్ ప్యానల్ లోని ఓ వైద్యుడు తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. సుశాంత్ మరణం విషయంలో చివరికి రియానే దోషిగా తేల్చే అవకాశం ఉంది. అయితే కేసును ఏ సెక్షన్ కింద నమోదు చేస్తారన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వస్తుంది.











