కరోనా విరామం తర్వాత తొలి టెస్టు సిరీస్. అది కూడా ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియాతో! గత సిరీస్ (2018-19)లో కంగారూ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఈ సారి భారీ అంచనాలతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో విజయం సాధించేందుకు సువర్ణావకాశం. కానీ దారుణమైన బ్యాటింగ్‌తో తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసి ఘోర పరాజయం. ఇదీ క్లుప్తంగా భారత జట్టు ప్రస్తుత పరిస్థితి. సిరీస్‌లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో జట్టు ఇప్పుడేం చేయాలి? జట్టు ముందున్న సవాళ్లు ఏమిటి?
రెండోటెస్టుకు ఆ నలుగురు!
అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్ మీద ఆశలు సజీవంగా నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి! ఈ అభిప్రాయం అభిమానుల్లోనూ బలంగా వినిపిస్తోంది. అయితే, బాక్సింగ్‌డే టెస్టులో విజయం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు అంత తేలిక కాదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరమవ్వడం వల్ల పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో నాలుగు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది.
బౌలింగ్ భారమంతా బుమ్రాపైనే…
గత పర్యటనలో ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోవడంలో పేసర్లు బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారు. 4 మ్యాచ్‌ల్లో బుమ్రా 21 వికెట్లు తీయగా.. షమీ 16 వికెట్లు పడగొట్టాడు. ఒకరు కాకపోతే మరొకరు రాణించి ప్రత్యర్థి భరతం పట్టారు. కానీ ప్రస్తుత సిరీస్‌లో గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు షమీ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పుడు పూర్తి భారం బుమ్రా, ఉమేశ్‌లపైనే పడనుంది.
పూజారా, రహానేలు నిలిస్తేనే..
కోహ్లీ గైర్హాజరీలో మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టు భారాన్ని మోసే బాధ్యత అనుభవజ్ఞులైన పుజారా, రహానేలదే. ఇప్పటివరకూ 66 టెస్టులాడిన రహానె.. 78 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన పుజారా ఆ అనుభవంతో జట్టుకు అండగా నిలవాలి. ముందుగా వీళ్లు తొలి టెస్టు ఓటమిని పక్కనపెట్టి మనసు తేలిక చేసుకోవాలి. బ్యాట్‌తో రాణించి యువ ఆటగాళ్లకు మార్గం చూపించాల్సిన గురుతర బాధ్యత వీళ్లపై ఉంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (43), రహానె (42) ఫర్వాలేదనిపించారు. కానీ వీళ్లు ఈ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. క్రీజులో ఎక్కువ సమయం గడిపి యువ ఆటగాళ్లతో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ వాళ్లపై ఉన్న ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేయాలి.
కీలక పోరులో కోహ్లీ దూరం..
గత కొన్నేళ్లుగా స్వదేశంలో, విదేశాల్లో జట్టును బాగానే నడిపిస్తున్న కెప్టెన్ కోహ్లీ.. సిరీస్‌లో మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేని లోటు.. సిరీస్ తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జట్టుపై గట్టి ప్రభావమే చూపనుంది. కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చినప్పటికీ ఆ బ్యాటింగ్ స్థాయిని అందుకుంటాడా? అన్నది సందేహమే. కేవలం బ్యాట్స్‌మన్‌గానే అని కాదు కోహ్లీ జట్టులో ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. తన దూకుడు, ఉనికి ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడుస్తుంటే.. కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో గ్రీన్‌ను వెనక్కి పంపి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. ఇప్పుడు అతడు లేకున్నా జట్టు అవే ప్రమాణాలను కొనసాగించాలి.
రహానె.. తనదైన ముద్ర వేస్తాడా?
మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభంలో రహానె ఎన్నో ఆశలు రేపాడు. విదేశాల్లో ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై తడబాటు లేకుండా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ స్థిరత్వమే లేదు. అంచనాలను అందుకోలేకపోయిన అతడు.. తన ప్రతిభకు అతడు న్యాయం చేలేదన్న అభిప్రాయం ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. ప్రస్తుతం అతడు జట్టుకు భరోసా ఇచ్చే స్థితిలో లేడు.
ఆటలో పడుతూ.. లేస్తూ…
రహానె… 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆడిన తొలి 13 సిరీస్‌ల్లో అతడు 9 సిరీస్‌ల్లో 50పై సగటు నమోదు చేశాడు. టెస్టు జట్టులో అంతర్భాగమైపోయాడు. అయితే 2017 శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం (సగటు 3.4) కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన (2018)కు టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. విదేశాల్లో మెరుగైన రికార్డున్నా ఎందుకో సెలక్టర్లు అతణ్ని కరుణించలేదు. మరోవైపు రహానె పరిమిత ఓవర్ల కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలతో సాగింది. కుర్రాళ్లతో పోటీ పడలేక వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయాడు. టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగి, వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అందుకున్నాడు. కానీ ఈ మధ్య ఆ ఫార్మాట్లోనూ అతడి ముద్ర కనిపించడం లేదు. ఒకప్పటి జోరును, స్థిరత్వాన్ని అందుకోలేకపోయాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత 23 టెస్టులు ఆడిన అతడు కేవలం రెండే శతకాలు సాధించాడు. సగటు 40 లోపే.
26న మెల్బోర్న్‌లో రెండోటెస్టు..
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన టీమ్ఇండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్ధ పడుతోంది. ఈనెల 26న మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు మొదలవుతుంది. జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేస్తారేమో అనే ఊహాగానాలు విపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే ఓ కీలక ప్రకటన చేశారు.
‘షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో మ్యాచ్ నిర్వహణకే మా తొలి ప్రాధాన్యత. క్రికెట్ సమర్థ నిర్వహణకు సీఏ పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. బయో భద్రత బృందం, ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలు, ఆసీస్ క్రికెటర్లతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం’ అని సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే ఓ అధికారిక ప్రకటనలో చెప్పాడు.
సిరీస్ ఏదైనా సరే మంచి ఆరంభం దక్కితే జట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పైగా ఆస్ట్రేలియాతో దాని సొంతగడ్డపై సిరీస్ అంటే కచ్చితంగా విజయారంభం చేయాలి. అలా చేస్తేనే జట్టు మానసికంగా బలంగా మారడం సహా ప్రత్యర్థిని వెనక్కినెట్టినట్లు అవుతుంది. కానీ టీమ్‌ఇండియా ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని పరాజయంతో మొదలెట్టింది. అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. భారత క్రికెట్ చరిత్రలో ఓ పీడకలలా మిగిలిపోయే పేలవ ప్రదర్శనతో అభిమానులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. కంగారూ జట్టుతో సిరీస్ అంటే తొలి మ్యాచ్‌లో మామూలుగా ఓడితేనే పుంజుకోవడం కష్టం.. అలాంటిది ఈ స్థాయిలో ఓటమితో పాటు అప్రతిష్ఠ మూటగట్టుకున్న భారత్ తిరిగి పుంజుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే!