క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల జాబితాను అమికస్ క్యూరీ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఆ జాబితా ప్రకారం, 22 రాష్ట్రాల నుండి 2,556 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు పలు కేసులలో నిందితులుగా ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేసులు ఉన్న ప్రజా ప్రతినిధుల సంఖ్య 4,442 కు చేరుకోవడం గమనార్హం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికైన ప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ అశ్వని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ లో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా ఈ జాబితాను సుప్రీంకు సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా నేర చరిత గల అభ్యర్థులు ప్రజా ప్రతినిధులుగా ఎంపిక అవుతుండటంతో రాజకీయాల నేరీకరణకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలపై నమోదయిన కేసులలో 174 మంది న్యాయస్థానాల నుంచి కఠినమైన చర్యలు ఎదుర్కోనున్నారు. మిగతా వారి మీద అవినీతి నిరోధక చట్టం 1988, మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002, ఆయుధాల చట్టం 1959, ప్రజా ఆస్తికి నష్ట నివారణ చట్టం, 1984, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 కింద పరువు నష్టం (ఐపిసి), మరియు ఐపిసి సెక్షన్ 420 కింద మోసం.లాంటి కేసులు నమోదైనట్లు అమికస్ క్యూరీ సుప్రీంకి తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకోవడం లాంటి కేసులు కూడా ప్రజా ప్రతినిధులపై ఎక్కువ శాతంలో నమోదయ్యాయని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులపై కేసులు
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా ప్రతినిధులపై 263 కేసులు నమోదైనట్లు ఈ జాబితాలో తేలింది. ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ ఎంపీలపై ఆరు కేసులు నమోదు కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఏకంగా 79 కేసులు నమోదు కావడం గమనార్హం. వీటితో బాటు మాజీ ఎంపీలు ఏడుగురిపై క్రిమినల్ కేసులు, 53 మంది మాజీ ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయంటూ ఈ జాబితా బయట పెట్టింది. వీరిలో ముగ్గురు ప్రజా ప్రతినిధులపై కోర్టులు స్టే ఇచ్చినట్లు తేలింది. ఏపీతో పోటీ పడుతూ తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కూడా 118 కేసులు నమోదయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై 107 కేసులు నమోదు కాగా మాజీ ప్రజా ప్రతినిధులపై 11 కేసులు నమోదు అయినట్లు తేలింది. నలుగురు ప్రజా ప్రతినిధులు తమపై నమోదయిన కేసులలో స్టేలు తెచ్చుకున్నారని ఈ నివేదికలో బహిర్గతమైంది.
నేర చరితలో రాష్ట్రాల నేతలు
క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న శాసనసభ్యులు (ప్రస్తుత మరియు మాజీ) ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. 1,217 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఇందులో 446 కేసులు సిట్టింగ్ శాసనసభ్యులు నిందితులు. 35 మంది సిట్టింగ్ శాసనసభ్యులు మరియు 81 మంది మాజీ శాసనసభ్యులు జీవితకాల శిక్షతో కూడిన ఘోరమైన నేరాలకు పాల్పడ్డారు. యూపీ తరువాత, అత్యధిక సంఖ్యలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు ఉన్న రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇక్కడ 531 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలు నిందితులు. వీటిలో 73 కేసులు జీవిత ఖైదుతో శిక్షార్హమైన నేరాలకు సంబంధించినవి (సిట్టింగ్ శాసనసభ్యులపై 30 కేసులు మరియు మాజీ శాసనసభ్యులపై 43 కేసులు ఉన్నట్లు తేలింది. కేరళ (333 కేసులు), ఒడిశా (331), మహారాష్ట్ర (330), తమిళనాడు (324) సిట్టింగ్ మరియు మాజీ శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.
ప్రజా ప్రతినిధులపై భారీగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని వారిపై నమోదయిన నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా అమలు జరగలేదని అమికస్ క్యూరీ తమ నివేదికలో తెలిపారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ప్రజా ప్రతినిధులపై చాలా రాష్ట్రాలలో కేసులు కూడా నమోదు కాలేదని తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల వివరాలను తాము ఇవ్వలేదని, సుప్రీంకి తెలిపిన అమికస్ ఆయా రాష్ట్రాలలో తక్కువ కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు.
సుప్రీంకి అమికస్ సూచనలు
ప్రజా ప్రతినిధులపై నమోదయిన కేసులను విచారించడానికి ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సూచించింది. స్పెషల్ కోర్టులో ప్రజా ప్రతినిధులపై నమోదయిన కేసుల తీవ్రతను బట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్షతో కూడిన నేరాలు, ఇతర నేరాలు అనే క్రమంలో స్పెషల్ కోర్టు విచారణ చేయాలని అమికస్ సూచించారు. సిట్టింగ్ శాసనసభ్యులపై నమోదయిన కేసులను ముందుగా విచారించి ఆ తరువాతే మాజీ శాసనసభ్యులు కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. తప్పని పరిస్థితులలో తప్ప ఈ కేసులను వాయిదా వేయరాదని అమికస్ స్పష్టం చేసింది.
విచారణ సమయంలో ప్రజా ప్రతినిధి హాజరయ్యే బాధ్యతను జిల్లా ఎస్పీ లకు అప్పగించాలని స్పెషల్ కోర్టులకు అమికస్ సూచించింది. నాన్ బెయిలబుల్ కేసులలో కూడా ఎస్పీ లకు బాధ్యత అప్పగించాలని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదయిన కేసులలో సాక్ష్యం చెప్పే వారికి తగిన రక్షణ కల్పించాలని కోరింది. నేర విచారణలను ఎదుర్కొంటున్న శాసనసభ్యుల ప్రభావం వల్ల సాక్షులకు హాని కలిగే అవకాశం ఉందని అమికస్ గుర్తించారు. ఈ విషయంలో, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు తగిన చట్టాన్ని అమలు చేసే వరకు “సాక్షుల రక్షణ పథకం, 2018” ను అన్ని రాష్ట్రాలకు వర్తించేలా చేయాలని స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడానికి ఈ కేసుల పురోగతిని హైకోర్టు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలంటూ అమికస్ సూచించారు. సెప్టెంబరు 2018 లో, అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీకాలం చివరి రోజులలో, రాజకీయ నాయకులను ఎన్నికలలో పోటీ చేయకుండా పెండింగ్‌లో ఉన్న నేరారోపణలతో నిషేధించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అటువంటి అనర్హతను పరిగణనలోకి తీసుకోవాలని అమికస్ పార్లమెంటును కోరింది. దేశం “పార్లమెంట్ తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది” అని అమికస్ తెలిపారు.
ఉపసంహరణ
నేరం రుజువయితే ఎన్నికలలో పోటీ చేయరాదనే నిబంధనలతో ఇప్పటికే ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ ఎన్నికలలో పోటీ చేసే అర్హత కోల్పోయారు. అమికస్ చేసిన సూచనలను సుప్రీం కోర్ట్ సమర్థిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది ప్రజా ప్రతినిధులు పోటీ చేసే అర్హత లేకుండా పోతోంది. దేశంలో ప్రజాప్రతినిధులు 4123 మంది ఉండగా వీరిలో 2,556 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని అమికస్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 50 శాతం మందికి పైగా నేర చరిత ఉన్న నేతలు చట్ట సభలలో ఉండటం గమనార్హం. ఇవి చట్టసభలా.. నేరగాళ్ల అడ్డాలా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సుప్రీం కోర్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది.!!