అన్‌లాక్ తరువాత కేంద్రం బస్సులను తిప్పికోవడానికి అనుమతులిచ్చింది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ రూట్ల విషయంలో కుదరని ఒప్పందం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా దసరా పండుగ సీజన్‌లో సుమారుగా రూ.100 కోట్ల వరకు ఆదాయాన్ని సంస్థలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ ముక్కుపిండి మరీ రెండు, మూడు రెట్లు టిక్కెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నా టీఎస్ ఆర్టీసీ, ఎపీఎస్ ఆర్టీసీలు చేతులు ముడుచుకుని కూర్చున్నాయనే విమర్శలను మూటగట్టుకున్నాయి. దసరా సీజన్‌లో ప్రయాణికుల జేబులకు చిల్లులు మాత్రం తప్పలేదు.
దీపావళి పండుగ కూడా రాబోతుంది. బస్సు సేవలు లేక ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పుడు తీరిగ్గా అధికారులు ఇరు రాష్ట్రాల అంతర్గత బస్సు రూట్ల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ సంస్థల ఎండీలు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం అంతరాష్ట్ర బస్సు సర్వీసులు మొదలు కానున్నాయి.
తెలంగాణదే పైచేయా..
ఒప్పందం విషయంలో తెలంగాణదే పైచేయిగా చూడాల్సి ఉంటుంది. ముందు నుంచి చెబుతున్న డిమాండ్‌కు ఏపీ తలూపక తప్పని పరిస్థితి. ఇరు సంస్థల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఏపీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతుంది. అలాగే తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ 1,60,919 కిలోమీటర్ల మేర తన బస్సుల్ని నడిపిస్తుంది. అదే లాక్‌డౌన్ ముందు వరకు 2,65,367 కిలోమీటర్ల వరకు తన బస్సుల్ని ఏపీ నడిపించేది. ఇప్పుడు తాజా ఒప్పందం వల్ల దాదాపు లక్ష కిలోమీటర్లలో కోతపడే అవకాశం లేకపోలేదు. ఇది ఏపీకి నష్టంగానే చూడాల్సి ఉంటుంది.
ఏటా రూ.270 కోట్ల నష్టం..
హైదరాబాద్-విజయవాడ మార్గం చాలా ముఖ్యమైనది. రోజుకు వేలాది మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంటారు. అక్కడి నుంచి ఇక్కడికి కూడా రాకపోకలను నడిపిస్తారు. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏపీ 374 బస్సుల్ని తిప్పేది. ఇప్పుడు అవి 192కి సంఖ్య తగ్గించుకోబోతున్నారు. తెలంగాణ బస్సులు కొత్తగా కుదుర్చుకునే ఒప్పందం ప్రకారం ఇకపై దాదాపు 273కి పెరగనుంది. పాత అవగాహన ప్రకారం 162 మాత్రమే తిరిగేవి. ఈక్రమంలో కర్నూల్ సెక్టార్‌లో 25వేలు, భద్రాచలం సెక్టార్‌లో 13వేల కిలోమీటర్లను ఏపీఎస్ ఆర్టీసీ తమ బస్సులను తగ్గించుకుంటోంది. నూతన ఒప్పందం ప్రకారం ఏపీకి భారీ నష్టం చేకూరనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ క్రమంలో ఏటా ఏపీకి రూ.270 కోట్ల నష్టం వస్తుందని ఒక అంచనా. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ ఆర్టీసీకు ఈరకంగా లాభమే అంటున్నారు.
తెలంగాణలో తిరుగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ రూట్లవారీగా సర్వీసులను తగ్గించుకునేందుకు అంగీకారం దాదాపు ఖరారైనట్లే ఇక లాంఛనమే తరువాయి. అయితే ఇలా తగ్గించుకోవడంవల్ల అదనంగా 40వేల కిలోమీటర్లకు పైగా ప్రైవేట్ బస్సులు రంగప్రవేశం చేసేందుకు మార్గం సుగమమైందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ తన్నుకుపోయే అవకాశం కూడా ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సుధీర్ఘ చర్చల తరువాత తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఇదివరకు మాదిరిగా తిరగనుండటంతో సాధారణ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.











