ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే టీడీపీకి పూర్తి వ్యతిరేకమని అర్ధమవుతోంది. అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు టీడీపీనే టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దియోధర్ కూడా చంద్రబాబును ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 25 సంవత్సరాల కిందట వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబును ఎన్టీఆర్ టీడీపీ నుంచి బహిష్కరించింది ఈ రోజే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అంటూ చంద్రబాబుకు ట్యాగ్ చేశారు. ఆ తరువాత బీజేపీ, ప్రధాని మోడీలపై లేని పోనీ అపవాదులు వేశారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారం లేరని త్వరలోనే రాజకీయాల నుంచి కనుమరుగవుతారని ఆయన ఎద్దేవా చేసారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన పనికి ఫలితం అనుభవించవలసిందే ఆయన హితువు పలుకుతూ ట్వీట్ చేశారు.
అబ్బా ఏమి చెప్పిరి చెప్పిరి చెప్పేందుకు మాత్రమే నీతులా? మీ విషయంలో ఇలాంటి సుద్దులు మీకు ఎందుకు గుర్తుకురావు సారూ? అనే ప్రశ్నలు సోషల్ మీడియా ద్వారా చాలా మంది అడుగుతున్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి సాక్షిగా హామీ ఇచ్చారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తీరుస్తామని హామీ కూడా ప్రధాని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి బీజేపీ నాయకులు తమ వాణిని, బాణీని మార్చారు. ప్రత్యేక హోదా కుదరదని ఏపీకిస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని సరికొత్త రాగాన్ని ఆలపించారు. ఇదే సమయంలో స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పడం మొదలెట్టారు.
పద్మవ్యూహాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు కానీ స్పెషల్ ప్యాకేజీ విషయం ఎవరికీ అర్ధం కాలేదు. అదొక బ్రహ్మ పదార్థం. పోలవరానికి జాతీయ హోదా అంటూ ఆర్బాటం చేసిన ఆ పార్టీ నాయకులు కొసరి కొసరి నామమాత్రం నిధులు ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించిన నాయకుల పరిస్థితి ఇంతే సంగతులు చిత్తగించకర్తలు. చంద్రబాబు వెన్నుపోటు చేశాడని విమర్శిస్తున్న బీజేపీ తాము పొడిచిన వెన్ను పోటును గుర్తు పెట్టుకోవాలని రాజకీయ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చేశాడంటూ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శల విషయానికి వస్తే అది ఓ పార్టీ అంతర్గత విషయం. కానీ బీజేపీ అధినాయకత్వం చేసిన వెన్నుపోటుతో ఓ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారిందనే కామెంట్లు పడుతున్నాయి.











