పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఖాకీలపై బూతులతో విరుచుకుపడటంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో తోపుదుర్తి ముందస్తుగా పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనెక్కడ ఉన్నారనేది తెలియకపోవడంతో రాప్తాడుతో పాటు అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి హద్దులు మీరి ప్రవర్తించారు. టీడీపీ నేతలకు కాపలా కాసేందుకు ఖాకీ చొక్కాలు అవసరమా? చొక్కాలు వదిలేసి రండి, మేమూ ఖద్దరు వేసుకోవడం మానేస్తాం.. మొగోళ్లలా కొట్టుకుందాం, చెప్పులు తీసుకుని కొడతాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బెటాలియన్లు తెచ్చుకుంటున్నారంటూ అధికారులపై, పోలీసులపై నా కొడకల్లారా అని అసభ్యకర పదజాలంతో బండ బూతులు తిట్టడం పెద్ద దుమారమే లేపింది.
స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో అధికారుల తీరుపై మండిపడిన తోపుదుర్తి, నామినేషన్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ హాల్లో దౌర్జన్యాలు చేస్తామంటే ఊరుకునేది లేదని, పరిటాల రవి చేసినట్టే మళ్లీ అదే చరిత్ర రిపీట్ అవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము గట్టిగా మాట్లాడి ఉండొచ్చని చెబుతూనే.. తాము అన్నది ధర్మమేనంటూ తన మాట తీరును, బూతులను సమర్థించుకోవడం గమనార్హం.
పోలీస్ వ్యవస్థను, అధికారులను అంత బహిరంగంగా బెదిరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, అరెస్ట్ భయంతో తోపుదుర్తి పత్తా లేకుండా పోవడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పోలీసులపై ఇలా బూతులతో రెచ్చిపోవడం, ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పరారీలో ఉండడంపై సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది.











