AP CM Jagans Sensational Comments That TDP Is Wrong
ఏపీలో మంగళవారం సాయంత్రం నుంచి రేకెత్తిన ఆందోళనకర వాతావరణం బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై చేసిన దాడులకు నిరసనగా బుధవారం నాడు టీడీపీ నేతలు నిరసనలకు దిగితే.. ఆ నిరసనలను అడ్డుకున్న వైసీపీ సర్కారు.. తనదైన మార్కును చూపిస్తోంది. ఇలాంటి క్రమంలో దాడికి గురైన టీడీపీదే తప్పు అంటూ వైసీపీ కీలక నేతలు, మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వాదననే వినిపించారు. జగనన్న తోడు లబ్ధిదారులకు నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన జగన్.. టీడీపీ చేసిన తప్పు కారణంగానే దాడులు జరిగాయన్న కోణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఏమన్నారంటే..?
ఈ దిశగా జగన్ అసలు ఏమన్నారన్న విషయానికి వస్తే..‘‘ప్రతి ఎన్నికలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోతోంది. దీనిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియా.. ఒక ఈనాడైతేనేమీ, ఒక ఆఒంధ్రజ్యోతి అయితేనేమి, ఒక టీవీ 5 అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఏ రకంగా తయారయ్యారో మీరే చూస్తున్నారు. వీళ్లే బూతులు తిడతారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు బహూశా ఏరోజూ వినలేదు. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నా. ఏనాడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు. ఆ బూతులు తిట్టారని చెప్పి.. మనపై అభిమానం ఉన్నవారు బీపీకి లోనై రియాక్ట్ అవుతున్నారు. విపక్ష నేతలు అబద్ధాలు ఆడతారు. అసత్యాలు ప్రచారం చేస్తారు. వంచన కనిపిస్తోంది. ప్రతి రాతలోనూ, ప్రతి మాటలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్రబుద్ధి కనిపిస్తుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు. మతాల మధ్య చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్టుగా కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న పరిస్థితులు కూడా మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఏ పేద వాడికి మంచి జరుగుతున్నా.. ఆ మంచి జరగకూడదు.. జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందోనని ఆ మంచిని ఆపేందుకు యత్నిస్తారు. రకరకాల కోర్టు కేసులు వీళ్లే వేయిస్తారు. రకరకాల వక్రీకరణలు వీళ్లే పేపర్లలో రాస్తారు, టీవీల్లో చూపిస్తారు’’ అంటూ జగన్ తనదైన శైలిలో చెప్పుకుపోయారు.
AP CM Jagans Sensational Comments That TDP Is Wrong
అందరి నోటా ఇదే మాట
ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ ఆందోళనలకు దిగితే.. ఎక్కడికక్కడ పోలీసులను మోహరింపజేసిన వైసీసీ సర్కారు నిరసనలను అణచివేసింది. అదే సమయంలో వైసీపీకి చెందిన కీలక నేతలు, జగన్ కేబినెట్‌లోని మంత్రులు వరుసబెట్టి మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ బూతులు మాట్లాడిన కారణంగానే తమ పార్టీ శ్రేణులు దాడులకు దిగాయని, ఈ క్రమంలో మొత్తం తప్పు అంతా టీడీపీదేనని, ఇందులో దాడులకు పాల్పడ్డ వైసీపీ శ్రేణులది లేశమాత్రమైనా తప్పు లేదని కూడా వారు చెప్పుకోవడం గమనార్హం. ఇలా మీడియా ముందుకు వచ్చిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులున్నారు. వీరితో పాటు ఆ పార్టీకి చెందిన చాలా మంది చోటామోటా నేతలు కూడా ఇదే వాదనలను వినిపించారు. జగన్ నోట ఏ మాటలైతే వచ్చాయో, సేమ్ టూ సేమ్ అలాంటి మాటలే వైసీపీ నేతల నోట వినిపించడం గమనార్హం.