Chandrababu Launches 36 Hour Protest Against Attacks On TDP Offices
తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆ పార్టీకి చెందిన పలు జిల్లాల కార్యాలయాలు, కీలక నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. వైసీపీ శ్రేణులు పాల్పడిన ఈ దాడులకు నిరసనగా 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఉదయం పార్టీకి చెందిన కీలక నేతలతో సమాలోచనలు చేసిన చంద్రబాబు నిరసన దీక్షకు దిగేందుకు నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న చంద్రబాబు దీక్ష శుక్రవారం సాయంత్రం 8 గంటల దాకా నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’అనే పేరును ఖరారు చేశారు. మంగళవారం సాయంత్రం వైసీపీ దాడులు జరిగిన వెంటనే హుటాహుటీన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పరుగు పరుగున వెళ్లిన చంద్రబాబు.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆపై దాడికి గురైన వారిని పరామర్శించారు. ఆ తర్వాత వైసీపీ విశృంఖల దాడులను ఎదుర్కొనేదెలా? అన్న విషయంపై పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారు. వైసీపీ దాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు.. దాడులకు వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేలా చేయడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే 36 గంటల నిరసన దీక్షకు దిగాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu Launches 36 Hour Protest Against Attacks On TDP Offices
శనివారం ఢిల్లీకి పయనం
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేపట్టనున్న చంద్రబాబు.. దీక్ష ముగిసిన వెంటనే శనివారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. టీడీపీ కార్యాలయాలు, పార్టీ కీలక నేతలపై వరుసగా చోటుచేసుకుంటున్న దాడులు, ఆ దాడుల వెనుక ఉంటున్నది వైసీపీ శ్రేణులేనన్న విషయాన్ని అమిత్ షాకు వివరించడంతో పాటుగా అందుకు తగ్గ ఆధారాలను కూడా చంద్రబాబు సమర్పించనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న విషయాన్ని కూడా హోం మంత్రికి వివరించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఓ ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాలపైనా దాడులు చేస్తున్న తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే మంగళవారం రాత్రే అమిత్ షాకు నేరుగా ఫోన్ చేసిన చంద్రబాబు.. వైసీపీ అరాచకంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే మార్గమని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా శనివారం నేరుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు.. అమిత్ షాను కలిసి ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలు అందజేయడంతో పాటు పక్కా ఆధారాలతో స్వయంగా పిర్యాదు చేయనున్నారు.