YSRCP Attacks On TDP
మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. వంద మందికి పైగా కొమ్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు.. పట్టాభిరామ్ కుటుంబ సభ్యులు భయకంపితులయ్యేలా అరాచకం సృష్టించారు. ఈ దాడి ముగిసిన మరుక్షణమే మంగళగిరిలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు నగరాల్లోని టీడీపీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడి జరిగింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, టీడీపీ కీలక నేతల ఇళ్లు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. ఈ దాడుల్లో టీడీపీ కార్యాలయాలను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు.. అడ్డువచ్చిన టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా.. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు షాక్‌కు గురయ్యారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి పరుగు పరుగున మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడ్డ వైసీపీ తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే వైసీపీ దాడులను అభివర్ణించారు. అంతేకాకుండా దాడులకు నిరసనగా బుధవారం నాడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఇదీ మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిన రచ్చ.
దాడులకు కారణమేంటి..?
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రవాణా అవుతున్న తీరు తెలిసిందే. నిత్యం గంజాయి పట్టుబడుతూ ఉంటే.. ఇటీవల ఆఫ్ఘన్ నుంచి విజయవాడకు వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ రవాణా అవుతూ గుజరాత్ లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రం డ్రగ్స్ దందాకు కేంద్రంగా మారుతోందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా అన్ని విపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బాధ్యత కలిగిన అధికార పార్టీగా వైసీపీ పూర్తి వివరాలను వెల్లడిస్తూ వాస్తవాలేమిటో వివరించాల్సిన అవసరం ఉంది. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాటే లేదని, విజయవాడకు వస్తూ పట్టుబడిన డ్రగ్స్ కూడా విజయవాడకు కాకుండా ఢిల్లీకి వెళుతున్నాయని.. ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పేసి.. తమపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నాయని గగ్గోలు పెట్టింది. అధికార పార్టీ సమాధానం చెప్పకుండా ప్రతి విమర్శలు చేసిన వైనంపై విపక్షాలు మరింతగా నిరసన గళం విప్పాయి. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటికి వచ్చిన పోలీసులు.. డ్రగ్స్ దందాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు అందజేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అర్ధరాత్రి వేళ తన ఇంటికి వచ్చిన పోలీసుల తీరుపై నక్కా ఆగ్రహం వ్యక్తం చేయగా.. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒకింత ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు జగన్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు క్షణాల వ్యవధిలోనే దాడులకు శ్రీకారం చుట్టాయి.
YSRCP Attacks On TDP
నిరసనలకూ ఆస్కారం లేదా?
ఏపీలో వైసీపీ పాలన మొదలైన నాటి నుంచి కూడా విపక్షాలపై ఆంక్షలు అమలు అవుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఆ మాట నిజమేనన్నట్లుగా మంగళవారం నాటి వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం టీడీపీ నిరసనలకు దిగితే.. ఆ నిరసనలకు అసలు ఆస్కారమే లేదన్న రీతిలో ఏపీ పోలీసులు వ్యవహరించారు. ఎక్కడిక్కడ టీడీపీ నేతలు బయటకు రాకుండా పక్కా వ్యూహాలు అమలు చేసిన పోలీసులు.. టీడీపీకి చెందిన కీలక నేతలు అసలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని చేధించుకుని బయటకు వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు చితమనేని ప్రభాకర్, బొడె ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా తమ పార్టీ శ్రేణులు చేసిన దాడులకు నిరసనగా ఆందోళనలు చేపట్టేందుకు ఆస్కారమే లేదన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంతో పాటు టీడీపీ నిరసనలపై ఉక్కుపాదం మోపింది.