(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఏపీలో వైసీపీపై రోజురోజుకూ అసమ్మతి పెరుగుతుండటం, తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలు విశ్వసించకపోవడంతో ఇదే అదనుగా ఏపీలో తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ ప్రస్తుతం తన ఫోకస్ ఏపీ మీద పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీలో ఆ పార్టీ దూకుడు మీదుంది. ముఖ్యంగా టీడీపీని దెబ్బ తీసేందుకు పెద్ద ఎత్తున వ్యూహం పన్నుతోంది. అధికార పార్టీ వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు నెరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీని పెద్దగా టచ్ చేయకున్నా, టీడీపీ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ బీజేపీ నాయకులు కూడా టీడీపీ మీద విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.
టీడీపీని తుదముట్టించేందుకు..
ఏపీలో టీడీపీని తుదముట్టించాలని బీజేపీ పథకం రచిస్తూ, దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా? లేదా? అనేది ఇదమిద్ధంగా చెప్పే పరిస్థితి ఆ పార్టీ నాయకుల్లో లేదు. అందులోనూ చంద్రబాబు తర్వాత ఆ పార్టీని అదే రేంజ్‌లో నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడైతే ఆ పార్టీలో లేడనేది నిర్వివాదాంశంగా ఉంది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోగలిగితే, టీడీపీలోని ముఖ్యులను తమ పార్టీలో చేర్చుకుంటే, వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పుంజుకునే చాన్స్ ఉందనేది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయం. అందుకే టీడీపీని ఖాళీ చేయడం కోసం ఆ పార్టీ ముఖ్యులపై కన్నేసింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా టీడీపీకి చెందిన నాయకులను తమ పార్టీలోకి కలిపేసుకోవడం ప్రారంభించింది. వాళ్లతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా దూకుడు మీదున్నారు. టీడీపీని టార్గెట్ చేసి.. టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.
AlsoRead ;-ఆ మహిళా టీడీపీ నేతపై బీజేపీ కన్ను
విజయనగరంపై దృష్టి
తెలుగుదేశం పార్టీకి ఆదినుండి పెట్టని కోటలా ఉన్న విజయనగరంపై ఇప్పుడు బీజేపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా విజయనగరం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ, వైసీపీ నాయకులను ఇప్పటికే బీజేపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి పై బీజేపీ దృష్టి సారించినట్లు తెలిసింది. ఆయన కూడా ఏ క్షణానైనా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఆయనకు బీజేపీ నుండి సరైన హామీ వస్తే చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకోసం కొద్దిరోజులుగా విస్తృత మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. సుస్పష్టమైన హామీ వచ్చిన మరుక్షణం ఆ మాజీ మంత్రి తన అనుచరులతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ బలపడేందుకు, టీడీపీని దెబ్బ కొట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు కదులుతున్న నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
AlsoRead ;-అమరావతి అటా.. ఇటా బీజేపీ గాలికొదిలేసిందా