ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ ఏడాది ఏడు నెలల కాలంలోనే ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్ల అప్పులు తెచ్చింది. ఆదాయం మాత్రం ఏడు నెలల కాలంలో కేవలం రూ.45 వేల కోట్లు మాత్రమే. అంటే ఏపీ ప్రభుత్వ ఆదాయం కన్నా అప్పులే ఎక్కువగా చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా ఈ నెలలో ఇంకా సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, మాజీ ఉద్యోగులకు పెన్షన్లు అందలేదు. సవరించిన ఎఫ్.ఆర్.బి.ఎం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇంకా ఆరు వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం దక్కింది. దీంతో ఏదోలాగా ఈ నెల గట్టెక్కించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను కోరుతున్నారని సమాచారం. బ్యాంకుల నుంచి అప్పు పుడితేనేగాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఇక ఈ నెలలో ఏపీ అప్పు తీసుకునే అవకాశం కోల్పోతుంది. అందుకే ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ హడావుడిగా ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కార్పొరేషన్‌లో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం, అబ్కారీ ఆదాయం జమ చేసి దాని ఆదాయంగా చూపి మరో రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకునే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
రూ.లక్షా రూ.30 వేల కోట్ల బకాయిలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 17 వేల గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తోంది. వీటికి రూ.15 వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక పేదలకు సెంటు భూమి పేరుతో 22 వేల ఎకరాలు భూ సేకరణ జరిపారు. ఆ భూములిచ్చిన రైతులకు ఇంకా రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటికి తోడు ప్రభుత్వం నాడు నేడు పేరుతో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాల బిల్లులు చెల్లించక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు రూ.లక్ష కోట్ల బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. ఇక గత ప్రభుత్వ హయంలో చేసిన పనులకు రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలపి మొత్తం లక్షా 30 వేల కోట్ల బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది.
పనులు నిలిపి వేసిన కాంట్రాక్టర్లు
కృష్ణా జిల్లాలో రూ.250 కోట్లలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులను అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 300 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, బెంచీలు, ఫర్నిచర్ సరఫరాతో పాటు అనేక పనులు చేపట్టారు. వీటిలో భాగంగా కృష్ణా జిల్లాలోని 80 పాఠశాలల్లో బ్లాక్ బోర్డులను తొలగించి గ్రీన్ బోర్డుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే బ్లాక్ బోర్డులు తొలగించారు. కానీ నేటికీ గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో తరగతి గదుల్లో అటు బ్లాక్ బోర్డులు లేక, కొత్తగా గ్రీన్ బోర్డులు రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపి వేశారు. దీని ఫలితంగా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
అసలు చెల్లిస్తారా?
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్పులు తీసుకునే అవకాశం కోల్పోయింది. ఇక ఆదాయం చూస్తే నెలకు రూ.5 వేల కోట్లు మించడం లేదు. ఖర్చు మాత్రం ప్రతి నెలా రూ.15 కోట్లుగా ఉంది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది వీటికి అదనం. ఇక ఏపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బిల్లుల బకాయిలే రూ. లక్షా 30 వేల కోట్లుగా ఉంది. ఇవన్నీ చెల్లించడం అసలు సాధ్యమేనా అనే అనుమానం రాక మానదు. ప్రతి నెలా పది వేల కోట్ల బకాయిలు చెల్లించినా సంవత్సరం పట్టేలా ఉంది. అప్పు పుట్టక , మరో వైపు రాష్ట్రానికి ఆదాయం కూడా లేకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారని తెలుస్తోంది. అందుకే ఎక్కడి పనులు అక్కడే నిలిపి వేశారు. డబ్బు చెల్లిస్తేనే పనులు పూర్తి చేస్తామనే సంకేతాలు పంపించారు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే..











