ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సలహ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై ఐవైఆర్ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ‘నిరసన తెలుపుతూ ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు జగన్ గాని తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముందు ప్యాకేజీ తీసుకొని హోదా కోసం పోరాటం కొనసాగించవచ్చు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిలయే ప్రమాదం ఉంది” అని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
బీజేపీ మోసం
రాష్ట్ర విభజనతో ఆర్థికంగా నష్టపోనున్న ఏపీకి కాంగ్రెస్ 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా మద్దతు తెలిపింది. 2014 ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఇదే అంశాన్ని ప్రచారం చేసింది. ప్రధాని అభ్యర్థిగా ఏపీలో పర్యటించిన మోడీ తిరుపతి సాక్షిగా తాము అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తామని ప్రకటించారు. హోదాపై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీని వారు పక్కన పెట్టేశారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ నీరు, మట్టి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నుంచి ఒత్తిడి పెరగడంతో గతంలో ఇచ్చిన హామీ 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంటూ అది ముగిసిన అధ్యయనం అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్యాకేజీని తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వం కోరింది. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నా నిధులు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం చొరవ చూపలేదు. దీంతో రాష్ట్రానికి ఇబ్బందనే ఉద్దేశంతో చంద్రబాబు స్టాండ్ మార్చి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందే అంటూ డిమాండ్ మొదలెట్టారు.
లాభపడి మోసం చేస్తున్న వైసీపీ
చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నాడని ప్రతి వేదిక మీద ప్రచారం చేసిన వైసీపీ 2019 ఎన్నికలలో లాభపడింది. హోదానే తమ లక్ష్యమని ప్రచారం చేసిన వైసీపీ అధికారంలోకి రాగానే కాడి దించేసింది. తాజాగా వైసీపీని ప్రభుత్వంలో చేరమని బీజేపీ ఆహ్వానించిందంటూ వార్తలు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. హిందూయేతర ఓట్లను నష్టపోతామనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వంలో చేరలేదు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకే ప్రభుత్వంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తీసుకున్న స్టాండ్ పై విమర్శలు వినబడుతున్నాయి.
కేంద్రమంత్రి స్పష్టత..మాజీ సీఎస్ సలహ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజయవాడ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ పెండింగ్ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధిచినవని, ఆ సంఘం గడువు తీరిపోయిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేగాక, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి ఏడాది గడిచిపోయిందని, దాని అమలు కూడా ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు. దీంతో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా సీఎం జగన్ కు ఈ విషయంపై సలహా ఇచ్చారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై జగన్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే నష్టపోక తప్పదని జగన్ ను రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు.