అప్పులు చేయడంలో ఇప్పటికే రికార్డులు తిరగరాస్తున్న ఏపీ ప్రభుత్వం మరో భారీ స్కెచ్ వేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ కార్పొరేషన్‌కు అప్పుపుట్టాలంటే ముందు దానిలో ఆదాయం చూపాలికదా. అందుకే ఏపీ ప్రభుత్వం మద్యంపై విధించిన అదనపు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కార్పొరేషన్‌కు వేల కోట్ల ఆదాయం చూపే అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్ ప్రారంభంలో రూ.5 లక్షలు మాత్రమే ఆథరైడ్డ్ క్యాపిటల్ చూపించారు. దాన్ని తాజాగా ఒకేసారి రూ.2500 కోట్లకు పెంచారు. దీంతో ఏపీ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అప్పుతీసుకునేందుకు మార్గం సుగమం కానుందని తెలుస్తోంది.
కార్పొరేషన్‌కు అర్హత ఉందా?
అప్పుల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. కొత్త అప్పులు చేయడానికి ఏపీ ప్రభుత్వం కనుగొన్న కొత్త మార్గం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ తీసుకునే అప్పులకు ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని భావిస్తోంది. అయితే, ఇలా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అసలు కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్‌కు బదిలే చేస్తే ఆ ఆదాయం దానికి వచ్చినట్టు కాదని వారు అంటున్నారు. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేని కార్పొరేషన్లు సృష్టించి ప్రభుత్వమే వాటిలో డబ్బు జమ చేసి రుణాలు తీసుకోవడం అంటే బ్యాంకులను మోసం చేయడమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అప్పుల కోసమే కార్పొరేషన్లా..
ఏపీ ప్రభుత్వం సంవత్సరంలో చేయగలిగే అర్హత ఉన్న అప్పులను ఆరునెలల్లోనే పూర్తి చేసింది. సంవత్సర కాలంలో ఏపీకి రూ.55 వేల కోట్లు అప్పు తీసుకునే సామర్థ్యం ఉంది. ఈ మొత్తాన్ని ఆరు నెలల కాలంలోనే తీసుకోవడంతో ఇక ఏపీకి కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయం గడచిన ఆరు నెలల కాలంలో రూ.90 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లకు పడిపోయింది.
ప్రతి నెలా రూ.7 వేల కోట్లు అప్పుతెస్తేనే..
దీంతో ఏపీ ప్రభుత్వం అప్పుల మీదే నెట్టుకొస్తోంది. ఇక ప్రతి నెలా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయానికి అధనంగా రూ.7 వేల కోట్లు అప్పుతెస్తేనే నవరత్నాలకు నగదు బదిలీ సాధ్యం అవుతుంది. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేక ప్రతి నెలా రెండోవారం చివరి వరకూ జీతాలు బదిలీ చేస్తూనే ఉన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే వచ్చే నెల నుంచి అసలు జీతాలు వస్తాయా.. రావా అని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
అవకాశం ఉన్న అన్ని రంగాల నుంచి..
ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఇప్పటికే రవాణా ఛార్జీలు పెంచారు. రిజిస్ట్రేషన్ పన్నులు కూడా భారీగానే వడ్డించారు. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, శ్లాబులు సవరించి భారీగా ఆదాయం గడిస్తున్నారు. ఇసుక ద్వారా ఇంత కంటే పిండటం సాధ్యం కాదు. అంటే ప్రభుత్వం అవకాశం ఉన్న అన్ని రంగాల నుంచి భారీగానే పన్నుల ద్వారా వసూలు చేస్తోంది. కానీ ఏపీకి కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతుండటంతో పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రభుత్వం త్వరలో దివాలా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











