ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం అమ్మకాలు ఆదుకున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేదు అన్నట్లుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉండడంతో రాష్ట్రం అర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అక్టోబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, ఇతర ఖర్చుల కోసం దమ్మిడీ లేకుండాపోయింది. అక్టోబర్ నెల గండం నుంచి బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 14 వేల కోట్ల రూపాయలు కావాలి. అన్ని నిధులు సమకూర్చడం పదిహేను రోజుల వ్యవధిలో అసాధ్యం.
రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 14 వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి ఇప్పించ వలసిందిగా అభ్యర్థన పంపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కేంద్రానికి వివరించాల్సిందిగా ఆదేశించారు.
మరోవైపు రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలిపి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీ పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో బార్లు నడుపుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో ఆరు నెలలుగా మూతలు పడ్డ బార్లు తెరుచుకున్నాయి.
ఐపీఎల్ సందడి
ఐపీఎల్ క్రికెట్ సంబరాలు ప్రారంభమైన రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ లో బారులు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఒకవైపు క్రికెట్ మజా ని, మరోవైపు మందు ఆనందాన్ని ఒకేసారి అనుభవిస్తున్నారు మందుబాబులు. ఇప్పటికే వైన్ షాపులు కూడా తెరుచుకోవడంతో వాటి నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తోంది. ఇప్పుడు బార్లు కూడా ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఆదాయం రెట్టింపు అయింది. గడిచిన నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి కనీసం నాలుగు వందల కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భారం నుంచి బయట పడుతుందని అధికారులు చెబుతున్నారు.
నచ్చింది కాదు.. ఇచ్చింది తాగండి..
ఆంధ్రప్రదేశ్ లో బార్లు బార్లా తెరుచుకున్నా మందుబాబులకు మాత్రం తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కొత్త పేర్లతో రాష్ట్రంలోకి దిగుమతి అయిన మద్యంతోనే కుషీ చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దశాబ్దాల కాలంగా ఒకే బ్రాండ్ మద్యానికి అలవాటు పడిన వారు ఇప్పుడు ఆ బ్రాండ్ దొరకక కొత్తవాటికి అలవాటు చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చునని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, వాటిని పట్టించుకోకుండా పోలీసులు మాత్రం వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల చెక్ పోస్టుల వద్ద కాపలా కాస్తున్న పోలీసు, ఎక్సైజ్ అధికారులు మద్యం తెచ్చుకోకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. “హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి అమలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కోర్టులను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా “ అని ప్రశ్నిస్తున్నారు.
బార్లలో చుక్కలు కనిపిస్తున్నాయి…
మందు తాగితే కిక్ ఇచ్చి దాని వల్ల చుక్కలు కనిపించడం పాత పద్దతి. ఇప్పుడు ధరలు వింటేనే చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బార్లలో ఇంతకు ముందు ఉన్న ధరలకు ఏకంగా రెండు మూడు రెట్లు ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని మందు బాబులు వాపోతున్నారు. మద్యం ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని అంటున్నారు. మద్యం మాన్పించాలంటే ధరలు ఎక్కువ చేయడం పరిష్కారం కాదని అంటున్నారు.











