జులై జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ అదరగొట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా GST వసూలు చేసి రికార్డులు సృష్టించింది. GST స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. నికర GST వసూళ్లు రూ.2,930 కోట్లు సాధించడం కూడా రికార్డే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ద రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని అధికారులు స్పష్టం చేశారు. 2017 తర్వాత ఈ స్థాయిలో జీఎస్‌టీ రెవెన్యూ వసూళ్లు కావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు ఆదాయ శాఖ అధికారులు..
GST నికర వసూళ్లు 2024 జులైతో పోలిస్తే ఈ జులైలో 12.12% పురోగతి నమోదైంది. GST మొత్తం వసూళ్లలో 14% మేర వృద్ధి ఉంది. 2024 జులైతో పోలిస్తే ఈ జులైలో SGST వసూళ్లు రూ.1,226 కోట్లు అధికంగా సాధించారు. కిందటేడాదితో పోలిస్తే ఇది 14.47% అధికం. వస్తు, సేవల వినియోగం పెరగడంతో పాటు తగిన పర్యవేక్షణ వల్ల ఈ ఫలితాలు వచ్చాయని వాణిజ్య పన్నుల శాఖ విశ్లేషిస్తోంది. IGST సర్దుబాటు తర్వాత రూ.1,704 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. కిందటి ఏడాది జులైతో పోలిస్తే ఇది 10.69% అధికం.
GST,పెట్రోలియం ఉత్పత్తులు, లిక్కర్‌పై వ్యాట్, వృత్తి పన్ను..ఇలా అన్నీ కలిపి 2024 జులైలో రూ.4,044 కోట్ల రాబడి సాధించగా, ఈ ఏడాది జులైలో రూ.4,493 కోట్లు వసూలయ్యాయి. అంటే 11.11% మేర వృద్ధి నమోదైంది. ఇలాంటి సానుకూల ఫలితాలు రావడానికి పన్నులు ఎగ్గొట్టకుండా నిఘా పెంచడం,IGST సర్దుబాట్లను గాడిలో పెట్టడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం కూడా కారణమని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు విశ్లేషించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు వరుస సమీక్షలు కూడా నిర్వహించారు. గత రెండు నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. మొత్తంగా చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఇక,ఇదే స్ఫూర్తితో కొనసాగితే ఏపీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందంటూ వైసీపీ చీఫ్ జగన్ చేసిన ఆరోపణలు ఉత్తివేనని తాజా జీఎస్టీ వసూళ్లు నిరూపించాయి. గత రెండు నెలల గ్యాప్‌లోనే జీఎస్‌టీ ఆదాయంపై వరస ప్రెస్ మీట్‌లు పెట్టి, తన ఘనతలని కీర్తించుకున్న జగన్ మోహన్ రెడ్డి, మరి, ఈ నెల జీఎస్‌టీ రెవెన్యూపై మీడియా ముందుకు వచ్చే సాహసం చేయగలరా అని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు.. మరి, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ ఏం చేస్తారో చూడాలి ఈ సవాల్‌పై..











