ఇటీవల వైసీపీలో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.జగన్‌ను అరెస్టు చేస్తారు లేదా జగన్ హ*త్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించడం సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలోనే స్వయం ప్రకటిత విశ్లేషకుడు పత్రి వాసుదేవన్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ను అంతం చేయడానికి అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని, ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారంటూ జులై 20న ఓ టీవీ ఛానల్‌లో చెప్పారు. మొత్తంగా అతడు సినిమా స్టైల్‌లో ఓ స్టోరీ చెప్పిన ఆ వాసుదేవన్ ఇప్పుడు కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వాసుదేవన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాసుదేవన్ వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారా, ఉద్దేశపూర్వకంగానే చెప్పారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాలు రేకెత్తించేలా..రెచ్చగొట్టేలా వాసుదేవన్ వ్యాఖ్యలు ఉన్నాయని గుంటూరుకు చెందిన జనసేన నేత యర్రంశెట్టి సాయినాథ్ ఫిర్యాదు మేరకు జులై 22న నల్లపాడు పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు రావాలని వాసుదేవన్‌కు పోలీసులు 41A నోటీసు ఇవ్వడానికి జులై 26న హైదరాబాద్ వెళ్లారు. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పోలీసులు ఈ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి CEO, ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వాసుదేవన్‌ను జులై 29న విచారణకు గుంటూరు పంపుతామని వారు చెప్పడంతో పోలీసులు వచ్చేశారు. ఆ రోజు విచారణకు రాకపోవడంతో ఆ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అదేరోజు ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వాసుదేవన్ కథనంపై తమకెలాంటి సమాచారం లేదని, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలున్నాయో తెలియదని చెప్పినట్టు సమాచారం. వాసుదేవన్ వ్యాఖ్యల వీడియోను పరిశీలించిన పోలీసులు..గతంలో ఆయన చేసిన విశ్లేషణలనూ పరిశీలిస్తున్నారు. ఆయన అందుబాటులో లేరని, చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నల్లపాడు CI వంశీధర్ తెలిపారు.











