(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున భక్తులకు సాక్షాత్కరించే శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి నిజరూప దర్శనం ఈ ఏడాది ఏకాంతంగానే జరుగుతోంది.కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా భక్తులను, విఐపిలను, చివరకు ట్రస్ట్ బోర్డు సభ్యులను సైతం ఉత్సవానికి అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ సంచైత గజపతిరాజుకు తొలి దర్శనం కల్పించారు.ఉత్సవ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని మాత్రమే ప్రత్యేక పాస్‌లు జారీ చేసి కొండపైకి అనుమతించారు.కోవిద్ కారణంగా భక్తులు ఈ ఏడాది కూడా స్వామి నిజరూప దర్శనాన్ని వీక్షించే అవకాశాన్ని కోల్పోయారు. దేవస్థానం యూట్యూబ్ చానల్ ద్వారా చందనోత్సవం లైవ్ ప్రసారం చేశారు.











