తెలుగు రాష్ట్రాలలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.బాలయ్య 62 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు చోట్ల కేకులు కట్ చేసి కోలాహలంగా ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. హైదరాబాద్ లోని బాలకృష్ణ ఇంటి వద్ద ఆయన అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన నటుడిని నేరుగా కలిసి విషెస్ చెప్పారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల్లో బాలయ్య పాల్గొన్నారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలోని ఆయన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బాలయ్య, అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.
బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కళాసేవ, ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేష అభిమానుల ఆదరణ చూరగొంటున్న మీరు.. చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి. ఎనలేని కీర్తి సంపదలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.
అదేవిధంగా బాలయ్యకు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు విషెస్ తెలిపారు. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా బాలయ్యతో తాను చేయబోయే సినిమా పై అధికారిక ప్రకటన విడుదల చేశారు. “గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అంటూ అనిల్ ట్వీట్ చేశాడు.ఈ నేపధ్యంలోనే బాలయ్యతో తాను దిగిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు.