లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మరికొంత మందికి ఎంట్రీ లేకపోవడంతో నిలకడగా ఉన్నారు. ఇంకొంత మంది మాత్రం రాజకీయాలకు స్వస్తి పలికారు. తాజాగా ఆ జాబితాలోకి మరో వైసీపీ నేత చేరారు. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఆ పార్టీని వీడుతున్నట్లు తొలుత జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే వైసీపీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌కు మరో నేత ఝలక్ ఇచ్చినట్లు అయింది.
మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత స్థాయికి ఎదిగారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. 1999, 2004లో కూచినపూడి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మోపిదేవి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఓడ రేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పంచన చేరారు.
2020లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీచేద్దామని భావించినా జగన్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో అందులో ఉండడం వేస్ట్ అని భావించినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత మంది మేయర్లు, కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి సమయంలో మోపిదేవి వెంకట రమణ వంటి సీనయర్ కూడా వైసీపీని వీడటం ఎదురుదెబ్బే అని అంటున్నారు