అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ సరికొత్త రూపును సంతరించుకోనుంది. భారీ బోయింగ్ విమానాల ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు ఎయిర్ పోర్ట్ లో జరుగుతున్నాయి. ఈ మేరకు భారీ రన్ వే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఏపీలోనే అతి పెద్ద రన్ వే కలిగిన ఎయిర్ పోర్ట్ గా విజయవాడ నిలిచిపోనుంది. ఈ రన్ వేకు సంబంధించి ఇటీవలే నిర్వహించిన ఫ్రిక్షన్ టెస్ట్ కూడా విజయవంతమైంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్ వే.. వచ్చే నెల 15న అందుబాటులోకి రానుందని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే మరోసారి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టులోఅ ందుబాటులో ఉన్న రన్‌వే పొడవు 7,500 అడుగులు మాత్రమే. కొత్తగా నిర్మిస్తున్న రన్ వే అందుబాటులోకి వస్తే రన్ వే పొడవు 11,023 అడుగులకు పెరుగుతుంది.
భారీ విమానాల ల్యాండింగ్.. టేకాఫ్
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు విజయవాడ అనువైంది. అందుకే ఎయిర్ పోర్ట్ కు బాగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఏపీ రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండటం కూడా బెజవాడ ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎయిర్ పోర్టును దశలవారీగా విస్తరించేందుకు డీజీసీఏ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ కొత్త రన్ వే ప్రారంభానికి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా.. వాటిని పక్కనపెట్టేసి మరీ కొత్త రన్ వేకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రన్ వే ప్రారంభమైతే… అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైతే… బెజవాడ ఎయిర్ పోర్టు రేంజే మారిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడో పూర్తి అయినా.. పాలకుల నిర్లక్ష్యమే అడ్డు
వాస్తవానికి రెండున్నరేళ్ల కిందటే ఈ రన్‌వే పనులు పూర్తయ్యాయి. అంటే టీడీపీ అదికారంలో ఉండగానే… ఈ రన్ వే పనులు పూర్తి అయ్యాయి. అయితే విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సి పరిహారం విషయంలో కొంత జాప్యం జరిగినా… దానిని సరిచేసే లోగానే రాష్ట్రంలో వైసీపీ అదికారం చేపట్టింది. అయితే ఆ తర్వాత అసలు ఎయిర్ పోర్టు కొత్త రన్ వే ప్రారంభం, పరిహారం సమస్యల పరిష్కారంపై జగన్ సర్కారు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వెరసి నిర్మాణం పూర్తి అయినా కొత్త రన్ వే ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఈ సమస్యల కారణంగానే డీజీసీఏ అనుమతులు రాలేదు. ఈ సమస్యలు కొంతవరకు పరిష్కరించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త రన్ వే ప్రారంభానికి డీజీసీే అనుమతులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రన్ వే అందుబాటులోకి వస్తే.. భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండింగ్, టేకాఫ్ కావచ్చు.
Must Read ;- జూన్ 2 నుంచి వందేభారత్ మిషన్.. నేరుగా విజయవాడకు విదేశీ విమానాలు