మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు ఓ సంప్రదాయం ఉంది. అది ఏంటంటే.. ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం. ఈ సంప్రదాయం గత కొన్ని సంవత్సరాలు బాగానే జరిగింది. అయితే.. ఈమధ్య కాలంలో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి.. పోటీకి సై అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. రాజకీయ ఎన్నికల ఎలా జరుగుతాయో అలా.. ప్రతిష్టాత్మకంగా.. రసవత్తరంగా జరుగుతున్నాయి. పరిశ్రమ పెద్దదిక్కు దాసరి నారాయణరావు ఉన్నప్పుడు మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. ఆయన లేకపోవడంతో ఇలా ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి.
వేదికల పై ఇండస్ట్రీలో మేమంతా ఒకటే.. మాది ఒకటే కులం.. అదే సినిమా కులం.. ఇలా స్టేట్ మెంట్ లు ఇస్తుంటారు కానీ.. విభేదాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విభేదాలు బయటపడుతుంటాయి. ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంటుంది. ఈమధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నాను అంటూ ముందుకు వస్తున్నారు. కరోనా టైమ్ లో సినీ కార్మికులను ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి చిరంజీవి మాట పై గౌరవంతో పోటీ లేకుండా మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయి అనుకుంటే.. గతంలో కంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం ఆసక్తిగా మారింది.
ఇంకా చెప్పాలంటే.. గతంలో కంటే ఎక్కువ వివాదాలు ఈసారి ఎన్నికల వలన వస్తాయనిపిస్తుంది. కారణం ఏంటంటే.. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారు. ఆయన నాన్ లోకల్. విష్ణు, జీవిత, హేమ లోకల్. దీంతో ఇప్పుడు నాన్ లోకల్, లోకల్ మధ్య పోటీగా మారబోతుంది. ఇదే జరిగితే.. ఈసారి ఎన్నికలు గతంలో కంటే ఎక్కువ వివాదస్పదం అవ్వడం ఖాయం. చిరంజీవి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారనే విషయం తెలిసింది. జీవితకు బాలకృష్ణ సపోర్ట్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే బాలయ్య సపోర్ట్ కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇలా పోటీపడి.. మీడియాకెక్కి పరువుతీసుకోవడం కరెక్ట్ కాదని సినీ పెద్దలు సర్థి చెప్పి గతంలో వలే ఏకగ్రీవంగా అధ్యక్షుడుని ఎన్నుకుంటే బాగుంటుంది. మరి.. అలా జరుగుతుందేమో చూడాలి.
Must Read ;- ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హే..‘మా’ అండ్ కో?