ఏపీ రాజధాని అమరావతిని ముంచడానికి మరో భారీ స్కెచ్ వేశారు. కృష్ణానది గర్భంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ యంత్రాలను మోహరించింది. నదిలో నుంచి రోజుకు వేలాది టన్నుల ఇసుకను నీటి ద్వారా తరలించి కరకట్ట వద్ద రాజధాని భూముల్లో నిల్వ చేయడానికి ప్లాన్ వేశారు. అలా మళ్లించిన నీటి ద్వారా వచ్చే వేలాది టన్నుల ఇసుకను అమ్ముకోవడానికి జేపీ అనుమతులు పొందింది. అయితే రాజధానికి భూములిస్తే వాటిని జేపీ చెరువుల్లా మార్చిందంటూ రైతులు తిరగబడ్డారు.కరకట్ట వెంట భారీ ఎత్తున తవ్వకాలు జరిపితే కట్ట బలహీనపడి రాజధాని గ్రామాలు వరదకు మునిగిపోతాయని రైతులు ఆరోపిస్తున్నారు.వెంటనే పనులు నిలిపివేయాలని సీఆర్డీయే కమిషనర్‌కు రైతులు వినతి పత్రం అందించారు.
పనులు పరిశీలించిన దేవినేని
రాజధాని కరకట్ట వెంట జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ జరుపుతున్న తవ్వకాలను మాజీ మంత్రి దేవినేని పరిశీలించారు. రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాల భూములిస్తే కమీషన్ల కోసం వైసీపీ నేతలు జేపీ కంపెనీకి భూములు కట్టబెట్టారని దేవినేని విమర్శించారు. కరకట్టను పటిష్టం చేయడానికి వందల కోట్లు ఖర్చు చేస్తామంటూ, ఇలా భారీ యంత్రాలతో తవ్వడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పనులు అడ్డుకోవడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. తాము రాజధాని అభివృద్ధికి భూములిచ్చామని, అభివృద్ధి చేసిన భూమి తిరిగి తముకు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వారు గుర్తు చేశారు. కరకట్ట లోపల భూములను చెరువుల్లా మార్చి రాజధాని మునిగిపోతోందని ప్రచారం చేయాలని చూస్తున్నారని మరి కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చట్ట వ్యతిరేకం
నదీ గర్బంలో డ్రెడ్జింగ్ చేయగా వచ్చిన ఇసుకను డంపింగ్ చేసే భూమిలో తనది కూడా ఉందని ఓ రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు.తన భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని, గత ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. ఇలా చెరువుల్లా మార్చి కరకట్ట పక్కనే తవ్వకాలు జరిపి రాజధాని గ్రామాలను ముంచాలని చూస్తున్నారని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం కుట్ర మరోసారి వెలుగు చూసింది. దీనిపై పెద్ద ఎత్తున పోరాడేందుకు రాజధాని రైతులు ముందుకు వస్తున్నారు.
Must Read ;- 3 రాజధానులపై ముందుకే.. మంత్రి బొత్స,ఎంపీ విజయసాయిరెడ్డి











