శ్రీ విష్ణు, దర్శకుడు చైతన్య దంతులూరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భళా తందనానా బాక్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ చైతన్య బాణం గురి తప్పలేదని సినీ అభిమానులు అంటున్నారు. షడృచులతో చిత్రం రూపుదిద్దుకుండానే టాక్ థియేటర్ ల వద్ద వినిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా హ్యూమర్, లవ్ వంటి అంశాలు కలిగి ఉంటుంది.
మూవీ మొదలవ్వడమే ఒక సస్పెన్స్, కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టాడు దర్శకుడు చైతన్య.హీరో, హీరోయిన్ లను కూడా కొత్తగా తనదైన స్టైల్ లో పరిచయం చేయడం కూడా ఆకట్టుకుంటుంది. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ కేథరిన్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా పండింది. ఇక అసలు కథ మొదలయ్యాక ట్విస్ట్ లు కూడా తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. వరుస హత్యలు వాటిపై పరిశోదన కోసం హీరోయిన్ రంగంలోకి దిగడంతో కథలో వేగం పుంజుకుంటుంది. హీరో శ్రీ విష్ణు కిడ్నాప్ తో స్టోరీ మరింత ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఇక ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఊహించని విధంగా డిజైన్ చేశారు దర్శకుడు. ఇంటర్వల్ ట్విస్ట్ తో కథ గమనమే మారిపోయి కథలో అప్పటిదాకా లేని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది .
సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా తగ్గనట్లుగానే ఉంటుంది. ప్రతీ సన్నివేశం చాలా బాలన్స్డ్ గా రూపుదిద్దినట్లు కథ సాగేకొద్ది అర్ధమవుతుంది. ప్రతీ సెగ్మెంట్ లో చోటుచేసుకునే మలుపులు రక్తి కట్టిస్తాయి. ప్రధానంగా మూవీలో ఇన్వెస్టిగేషన్, క్రైమ్ వంటి అంశాలు ప్రేక్షకులలో ఉత్కంఠని పెంచడమే కాకుండా.. కిక్ మీద కిక్ ని ఇచ్చేలా ఉన్నాయి. ప్రతీ సన్నివేశం ఇంటెన్సిటీ పెంచేలా చక్కగా చిత్రీకరించబడింది.
శ్రీవిష్ణు నటుడిగా ఎప్పుడూ తన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తాడు. ఈసారీ అంతే. తన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకమైన కుర్రాడిగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. విరామం తర్వాత ఆయన నటనలోని యాక్షన్ కోణం ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. కేథరిన్ జర్నలిస్ట్ పాత్రలో మంచి అభినయం ప్రదర్శించారు.మూవీలో టెక్నికల్ విభాగాలు చక్కటి పనితీరునే కనబరచగా.. మణిశర్మ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది.
ఓవర్ ఆల్ గా ఓ జోడీ, మధ్యలో ప్రేమ, పాటలు, మధ్యలో కామెడీ, ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్, ఆకట్టుకునే క్లైమాక్స్.. ఇలా ప్రతీ అంశంలో డైరెక్టర్ చైతన్య దంతులూరి తన మార్క్ మరోసారి చూపించుకున్నాడు. ఈ చిత్రంతో చైతన్య గురి పెట్టిన బాణం గురి తప్పలేదనే చెప్పుకోవచ్చు.