తెలంగాణలో ఎన్నికల వేడి మొదలయ్యిందా ? అక్కడి రాజకీయం మొత్తం రాహుల్ పర్యటన చుట్టూనే తిరుగుతోందా ? టీఆర్ఎస్ , టి.కాంగ్రెస్ మధ్య వివాదం తారా స్థాయికి చేరడానికి కారణం ఏమిటి ? రాహుల్ పర్యటన పై అధికార పార్టీలో భయం మొదలయ్యిందా ? రాహుల్ టి.కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకొస్తారా ? ఆపరేషన్ తెలంగాణగా రాహుల్ రచించిన వ్యూహాలు ఏమిటి ?
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి.అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణ రానున్నారు. కాగా రాహుల్ పర్యటనతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యిందనే చర్చ తెరపైకి వస్తోంది.
గత రెండు తడవులు తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి దూరమైంది.తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ కు వెలితిగా ఉందట. ఏపీలో పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారానికి దూరం కావడం టి.కాంగ్రెస్ నాయకులకు రాజకీయంగా నష్టం వాటిల్లిందనే చర్చ జోరుగా సాగుతోంది.వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో మూడోసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉందట.
ఈ నేపధ్యంలోనే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను గద్దె దించాలని భావిస్తున్న టి.కాంగ్రెస్ దానికి తగ్గా వ్యూహాలను రచించుకున్నారట. అందులో భాగంగానే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని రప్పించాలని డిసైడ్ అయ్యారట.అయితే 2018 ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వచ్చిన రాహుల్ మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్నారు. కాగా, రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ రావాలని నేతలు కోరుకుంటున్నారు.
ఇక రెండు రోజుల పాటు కొనసాగానున్న రాహుల్ పర్యటనలో కీలక అంశాలను ఆయన ప్రకటించబోతున్నారట. వరంగల్ లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు. అదే సమయంలో రైతులకు తమ ప్రభుత్వం ఏం చేసింది, తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నాం అనే అంశాలను రాహుల్ వివరించనున్నారట. అదేవిధంగా హైదరాబాద్ లో పార్టీ నేతలతోనూ కాంగ్రెస్ అగ్రనేత సమావేశవనున్నారు. 8 ఏళ్లలో పార్టీకి జరిగిన డామేజ్, పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలపైనా నాయకులతో ఆయన చర్చించి, భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేయనున్నారట.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పర్యటన పై అధికార పార్టీలో భయం మొదలయ్యిందనే చర్చ కొనసాగుతోంది.రాహుల్ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్ధులతో ముఖా ముఖీ నిర్వహించాలని నిర్ణయించగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాహుల్ సభకు అనుమతి నిరాకరించారు. అయితే రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే పర్మిషన్ ఇవ్వలేదనేది కాంగ్రెస్ ఆరోపణ.టీఆర్ఎస్ పాలనపై విద్యార్ధులు, నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకథతో ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఓయూలో పర్యటిస్తే వారంతా కాంగ్రెస్ వైపు మరలిపోయే అవకాశం ఉందని , అది తమకు తీవ్ర నష్టంగా పరినమిస్తుందనే భావనతోనే టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా సానుకూల స్పందన రాలేదు.
ఇదిలా ఉంటే ఓయూ ఎపిసోడ్ తో టి.కాంగ్రెస్ కు పొలిటికల్ మైలేజ్ బాగానే వచ్చిందట. యూనివర్సిటీలో రాహుల్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడానికి నిరసనగా యువజన కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. కాగా వారిని పోలీసులు అరెస్ట్ చేయడం, అరెస్ట్ అయినవారిని సీనియర్ నేతలు పరామర్శించడం పొలిటికల్ డ్రామాగా మారిందట.దీంతో కొంతకాలంగా టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి గా కనిపించిన రాజకీయం, ఇప్పుడు రాహుల్ టూర్ తో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారినట్లుగా కనిపిస్తోందని టాక్.
ఇదే క్రమంలో క్యాడర్ ను ఉత్తేజితుల్ని చేసి ఎన్నికల వరకు వరుస కార్యక్రమాలను షెడ్యూల్ చేయాలని టీపీసీసీకి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందట. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, నౌ ఆర్ నెవర్ అనే నినాదంతో పనిచేయాలని హై కమాండ్ ఆదేశించిందట. దీంతో కాంగ్రెస్ గతానికి భిన్నంగా పాలిటిక్స్ లో కొంత దూకుడును ప్రదర్శిస్తోందట.అదే పంధాను కొనసాగిస్తూ కాస్త సెంటిమెంట్ ని కూడా కలగలిపితే మైలేజ్ అదే వస్తుందనే, తద్వారా సెంటిమెంట్ రాజకీయాలు చేసే అధికార టీఆర్ఎస్ పార్టీని అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందని టాక్.
మరి రాహుల్ గాంధీ పర్యటనతో అయినా టి. కాంగ్రెస్ లో మార్పు వస్తుందా ? నైరాశ్యంలో ఉన్న క్యాడర్ పర్యటన జోష్ నింపుతుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.