కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్ చేశాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. టీడీపీ,జనసేన,బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టేందుకు ఫేక్ అకౌంట్లతో వైసీపీ పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రకటనలో కూటమి స్పష్టం చేసింది. సోషల్‌మీడియాలో మిత్ర పక్షాల నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చర్యలు తప్పవని 3 పార్టీలు హెచ్చరించాయి.
కూటమి పార్టీల అభిమానుల ముసుగులో ఫేక్ అకౌంట్లను సృష్టించి వైసీపీ ఈ కుట్రలకు పాల్పడుతోందని ప్రకటనలో తెలిపింది. ఓ అకౌంట్ ద్వారా TDP అభిమానిలా నటిస్తూ పవన్ కల్యాణ్‌ను విమర్శించడం, మరో అకౌంట్‌లో జనసేన కార్యకర్తలా నటిస్తూ చంద్రబాబును దూషించడం వంటివి చేస్తున్నారు. వైసీపీ పన్నుతున్న ఈ వలలో పడి నిజమైన కార్యకర్తలు ఆవేశంతో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ప్రత్యర్థికి రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారని కూటమి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ పరిస్థితికి చెక్ పెట్టి, మిత్రధర్మాన్ని కాపాడేందుకు మూడు పార్టీల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమైంది. ఇకపై TDP, జనసేన, BJPకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా సరే.. మిత్రపక్షాల నేతలు, వారి కుటుంబ సభ్యులపై విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగితే ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కూటమి శ్రేణులు ఆవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే స్పందించకుండా ఆయా పార్టీల దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఒకరిపై ఒకరు విమర్శలు మాని ఐక్యతను చాటాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చింది.











