కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు మూడు గ్రూపులుగా విడిపోయారు. తాజాగా ఆత్కూరు మండలం చినఅవుటపల్లిలో వైసీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని కేసులు పెట్టుకున్నారు. చినఅవుటపల్లి గ్రామం పంచాయతీ చెరువు లీజుకు తీసుకుని, పొలానికి చెరువు నీరు పెట్టుకుంటున్న వైసీపీ వర్గంలో మరో వర్గం దాడి చేసింది.
చినఅవుటపల్లి మాజీ సర్పంచ్ కోట వినయ్ వర్గం చెరువు నీరు పెట్టుకుంటుండగా వల్లభనేని వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. జాతీయ రహదారిపై ఇరువర్గాలు గొడవకు దిగడంతో శుక్రవారం అర్థరాత్రి గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆత్కూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చినా చాలా సేపు గ్రూపులను అదుపు చేయలేకపోయారు.
గొడవ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ, దుట్టా
చినఅవుటపల్లి గొడవకు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధం లేకపోయినా ఘటన జరిగిన వెంటనే ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దుట్టా రామచంద్రరావు కూడా స్టేషన్‌కు వచ్చారు. దీంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గన్నవరంలో జరిగిన ఘటన గురించి సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరిస్తానని దుట్టా రామచంద్రరావు ప్రకటించారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గన్నవరం వైసీపీలో మూడుముక్కలాట
గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వంశీ, దుట్టా, యార్లగడ్డ వర్గాలు ఏర్పడ్డాయి. ఏ చిన్న విషయం వచ్చినా గొడవకు దిగుతున్నారు. వైసీపీ అధిష్ఠానం ఎన్ని సార్లు పంచాయితీ పెట్టినా అప్పటికి అందరూ సైలెంట్‌గా ఉంటారు. తరవాత ఎవరు చేయాల్సిన పని వారు చేసుకుంటూ పోతున్నారు. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో వర్గపోరు మరింత ముదిరింది. పది సంవత్సరాలు వైసీపీ వారిని వంశీ వర్గీయులు వేధించారని వారితో కలసి పనిచేసే ప్రసక్తే లేదని దుట్టా రామచంద్రరావు బహిరంగంగానే ప్రకటించారు. రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.