లాస్ట్ ఇయర్ ‘వెంకీమామ, మజిలీ’ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు అక్కినేని నాగచైతన్య. ఒక సినిమాలో మేనమామతోనూ, మరో సినిమాలో జీవితభాగ స్వామితోనూ నటించి.. వారితో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ రెండు విజయాలతోనూ చైతూ.. మరింత ఉత్సాహంతో నెక్స్ట్ మూవీస్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎక్కువగా .. రొమాంటిక్ కాన్సెప్ట్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తూ .. మంచి మంచి కథల్ని వింటున్నాడట. నిజానికి నాగచైతన్య ఈ జోనర్ లోనే ఎక్కువ హిట్స్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి ముచ్చటగా మూడు సినిమాల్ని విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాడు అక్కినేని వారబ్బాయి.
ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి హీరోయిన్ గా సెన్సిటివ్ లవ్ స్టోరీ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు చాలా భాగం కంప్లీట్ అయింది. లాక్ డౌన్ లేకపోతే.. ఈ పాటికి థియేటర్స్ లో ఉండాల్సిన సినిమా. త్వరలోనే షూటింగ్ ను పున:ప్రారంభించి బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. నాగచైతన్య ఇందులో తెలంగాణా యువకుడిగా నటించడమే కాకుండా.. మొదటిసారిగా తెలంగాణా స్లాంగ్ మాట్లాడబోతున్నాడు.
రీసెంట్ గా నాగచైతన్య మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే టైటిల్ తో ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగచైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని వెరైటీ పాత్ర లో దర్శనమివ్వబోతున్నాడట. దిల్ రాజు నిర్మాణం లో రూపొందబోతున్న ఈ సినిమాపై నాగార్జున మంచి హోప్స్ పెట్టుకున్నారు. త్వరలోనే కేస్టింగ్ , ఇతర సాంకేతిక నిపుణుల్ని ఎంపికచేసుకొని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతుందని టాక్.
ఇక నాగచైతన్య మరో రెండు సినిమాల్ని కూడా లైన్ లో పెట్టుకున్నట్టు టాక్. అందులో ఒకటి నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కాగా.. మరొకటి ఇంద్రంగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేయబోయే సినిమా. ఈ రెండు సినిమాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలుస్తోంది.
చైతూతో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది నందిని రెడ్డి. సమంతతో ‘ఓ బేబీ’ మూవీ చేసేటప్పుడు .. చైతూ కోసం అనుకున్న కాన్సెప్ట్ వినిపించిందట నందిని రెడ్డి.
స్టోరీ లైన్ సమంతకు నచ్చడంతో .. నాగచైతన్యకి కూడా వినిపించి.. ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసుకోమని సూచించిందట. ఇటీవల సందిని రెడ్డి చైతూకి కాన్సెప్ట్ వినిపించగా.. అతడు పాజిటివ్ గా రియాక్టయ్యాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. అలాగే… ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాన్సెప్ట్ కూడా చైతూకి బాగా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమాని కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఈ రెండింట్లో ఒకటి వచ్చే సంవత్సరమే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి నాగచైతన్య వచ్చే ఏడాదికి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో రెడీ అవుతుండడం విశేషం.











