వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం వివేకా కుమార్తె సునీతా రెడ్డి గత ఐదేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసును సీబీఐలో ఎస్పీ రాంసింగ్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వీరిద్దరిపై తాజాగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిపై కూడా కేసు పెట్టారు. ఈ పరిణామంతో అంతా అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే.. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఆయన గత పీఏ కృష్ణారెడ్డి మూలంగా ఇప్పుడు సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాం సింగ్ పై కేసు నమోదైంది. కొందరు తనను బెదిరిస్తున్నారని కృష్ణారెడ్డి గతంలోనే ఆరోపించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. తనపై బెదిరింపులు అంటూ అప్పట్లోనే కృష్ణారెడ్డి కడప ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. కొన్నాళ్లకి పులివెందుల కోర్టుకు కూడా వెళ్లారు.
ఈ కేసుతో సంబంధం ఉందని కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు, సునీత ఒత్తిడి చేస్తున్నట్లు కృష్ణారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి, తనకు రక్షణ కావాలని పోలీసులను కోరినా ఫలితం లేదని, అందుకే కోర్టుకు వచ్చానని పిటిషన్ లో వివరించారు. అటు సీబీఐ ఎస్పీ రాం సింగ్ కూడా కొంత మంది నాయకుల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలని బలవంతం చేసినట్లుగా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు.. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాం సింగ్‌పై కేసు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. అందుకే ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఇలా కృష్ణారెడ్డి చేసిన ఆరోపణల తరహాలోనే.. కొంత మందికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని భయపెడుతున్నారని ఆరోపిస్తూ.. యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి 2022 ఫిబ్రవరిలో కడప ఏఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సీబీఐకి చెందిన రాం సింగ్ పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనం అయింది. సీరియస్ సెక్షన్లతో కేసు పెట్టడంతో.. సీబీఐ ఆ కేసుపై హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్టే విధించడంతో.. అప్పట్లో సీబీఐ దర్యాప్తు అధికారిని పోలీసులు ముట్టుకోలేకపోయారు. తాజాగా బాధితులు, దర్యాప్తు అధికారిపైనే ఏకంగా పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే, ఇది జగన్ తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం పన్నిన నాటకం అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.