ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మరీ అన్యాయంగా ఉంటుండడంతో అసమ్మతి నేతలంతా జట్టు కడుతున్నారు. సీఎం జగన్ లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కలిసి తమ అధినేతకు తెలియకుండా తెర వెనుక ఓ రాజకీయమే చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ల మీద ప్రజా వ్యతిరేకత అంటూ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోయినా, లేదా వేరే చోట సీటు ఇచ్చినా సహించేది లేదని మంత్రులు కూడా తెగేసి చెబుతున్నారు. అయినా మొండి వైఖరితో జగన్మోహన్ రెడ్డి స్థాన చలనం తప్పదు అనేలాగే వ్యవహరిస్తే పార్టీకే గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ అసమ్మతి నేతలంతా కలిసి ఓ వైసీపీ ఎంపీకి చెందిన గెస్ట్ హౌస్ లో సమావేశమైనట్లుగా సమాచారం. రాయలసీమకు చెందిన ఆ ఎంపీకి బెంగుళూరులో ఫాం హౌస్ ఉండగా.. దాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రసవత్తర రాజకీయాన్ని వారు మొదలు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎంపీకి చెందిన గెస్ట్ హౌస్ లో దాదాపు 75 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకొని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే తమ పార్టీ అధినేత జగన్.. తమ వినతులను పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఎదురు తిరగాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బుజ్జగించాలని ప్రయత్నించినప్పటికీ, ఊరుకోకూడదని వారు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది.
సీటు దక్కని ఎమ్మెల్యేల సంగతి అటుంచితే.. ఎమ్మెల్యేల స్థానచలనం విషయంలో అభ్యర్థులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలా చేయడం అనేది పార్టీ మనుగడకే ఎసరు పెడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు సొంత నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రజలతో మమేకమై, స్థానిక కింది స్థాయి పార్టీ శ్రేణులను తమ గ్రిప్ లో ఉంచుకున్న తమకు.. కొత్త నియోజకవర్గం కేటాయిస్తే పట్టు దొరకదని ఎమ్మెల్యేలంతా అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రజా వ్యతిరేకత అన్న ఒక్క సాకుతో ఎడాపెడా టికెట్లు నిరాకరించడం లేదా మరో చోట నుంచి బలవంతంగా పోటీ చేయించడం వంటివి జగన్ కే నష్టం తెచ్చి పెడతాయని అసమ్మతి ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
జగన్ ధోరణి కనుక అంతే కొనసాగితే.. సంక్రాంతి తరువాత అసమ్మతి ఎమ్మెల్యేల్లో చాలా మంది తమ దారి తాము చూసుకొనే పనిలో ఉన్నట్లు సమాచారం. అసలే ఎన్నికల ముందు ఇప్పుడు టీడీపీ బాగా స్వింగ్ లో ఉంది. సమయం చూసుకొని జనవరిలో టీడీపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో అతి త్వరలో పెద్ద ఉపద్రవమే జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది.











