టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ, ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్లను ప్రకటించారు. మొత్తం 24 మంది సభ్యులతో పార్టీ కొత్త పొలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఎల్.రమణను మళ్లీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఆసక్తికరంగా మారింది.
విజ్ఞప్తులను పట్టించుకోని బాబు!
ఇక తెలంగాణ విషయానికొస్తే.. తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను చంద్రబాబు నియమించారు. అయితే గతంలో ఎల్.రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు నాయుడికి లేఖల ద్వారా విజ్ఞప్తులు చేశారు. అయినా కానీ మళ్లీ ఆయనకే అవకాశం కల్పించడం తెలంగాణ టీడీపీ ఒక వర్గంలో అసంతృప్తిని రగిలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్లుగా తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎల్.రమణ చేతిలోనే ఉంటున్నాయి. ఒకేవ్యక్తికి ఇన్నేళ్లుగా పార్టీ పగ్గాలు కట్టబెట్టడం మంచిది కాదనే విషయాన్ని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పునరుజ్జీవం తీసుకురావడంలో అధ్యక్షుడిగా రమణ ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే పనిలో ఉన్న చంద్రబాబు… తెలంగాణ టీడీపీ నేతలు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈసారి కొత్త వారికి అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ తెలంగాణ తెలుగు తమ్ముళ్ల విజ్ఞప్తులను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదనే విషయం రమణను మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతోనే తేలిపోయింది. అలాగే తెలంగాణ నుంచి మరికొంత మంది నాయకులను కూడా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.
అతనే బెటరనుకున్నారా?..
ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి తిరుగుండేదీ కాదు. కానీ రాష్ట్ర విభజన తరువాత క్రమంగా టీడీపీ కనుమరుగవుతూ వస్తోంది. దీంతో పార్టీ మనుగడపై చంద్రబాబు దృష్టి సారించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్న కారణంగా వారిని కాపాడుకోవడం, పార్టీని తెలంగాణలో పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడి బయటకు వెళ్లడంతో తెలంగాణలో పార్టీ బలహీనపడింది. ఈ క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పటి నుంచి ఇప్పటి వరకు రమణే నడిపిస్తున్నారు.
ఆశించిన స్థాయిలో పార్టీని ఆయన ముందుకు నడిపించకపోయినప్పటికినీ పార్టీనే నమ్ముకున్న వ్యక్తిగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావడం, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేతగా ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అధ్యక్షునిగా ఎల్.రమణకు ఆ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. మరోవైపు ఆయనపై అసంతృప్తి రాగం వినిపించిన తెలంగాణ టీడీపీ నేతలు రమణతో కలిసి తెలంగాణలో పార్టీ అభివృద్ధికి పనిచేస్తారో లేదో చూడాలి. అలాగే అధ్యక్షుడిగా రమణ నియామకం టీడీపీ తమ్ముళ్లలలో నూతనోత్సాహం నింపుతుందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది.