అసెంబ్లీ ఎన్నికలు ఏ రేంజ్‌లో జరుగుతాయో.. అంతే రసవత్తరమైన పోరు జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార పార్టీ సంకేతాలను ఎప్పటికప్పడు ఇస్తూనే ఉంది. దానికి సంబంధించిన గ్రౌండ్ లెవల్ వర్క్‌ను పూర్తి చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. టిఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో మిగతా పార్టీల కంటే ముందు వరుసలోనే ఉంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం సమాచారమిచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ముందస్తు ఎన్నికల పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు బల్దియా ఎన్నికలకు సంబంధించి అమలు చేసే వ్యూహ, ప్రతి వ్యూహాలను అమలు పర్చడం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ కంటే వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ మాట అటుంచితే టిడిపి నాయకత్వం మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంత సుముఖత చూపడంలేదని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి ఇష్టమున్న.. లేకున్నా.. తాము మాత్రం పోటీ చేసి తీరుతామనే ఆలోచనలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఉన్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ టిడిపి అధిష్ఠానం ఒప్పుకోకపోతే ఎలా అనే అంశాలపైన గ్రేటర్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తమ నేత చంద్రబాబు నాయుడును కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఫిబ్రవరి 2015 జీహెచ్‌ఎంసీ పాలకవర్గం కొలువుదీరింది. ఫిబ్రవరి 2019 నాటికి పాలకవర్గం నాలుగేండ్లు పూర్తి చేసుకుంది. 2020 ఫిబ్రవరితో టర్మ్ పూర్తవుతోంది. అంత వరకు ఆగకుండా త్వరలోనే ఎన్నికలకు పోవాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. కోటికిపైగా జనాభా కల్గిన హైదరాబాద్ మహానగరంలో సుమారు 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో 150 వార్డులకుగాను టీఆర్‌ఎస్ 99, మజ్లీస్‌పార్టీ 44, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ రెండు, టీడీపీ ఒక వార్డులను కైవసం చేసుకున్నాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడంతో టీఆర్‌ఎస్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయొద్దీన్ బాధ్యతలు స్వీకరించారు.
2009లో జరిగిన బల్దియా ఎన్నికల్లో జీరో స్థానాలున్న టీఆర్‌ఎస్ 2015లో బంపర్ మెజార్టీ సాధించింది. అదే 2009 ఎన్నికల్లో హీరోగా ఉన్న కాంగ్రెస్ 2015 ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బల్దియా పాలకవర్గంలో టీఆర్‌ఎస్, మజ్లీస్‌పార్టీ, బీజేపీలు మాత్రమే ఉన్నాయి.











