ఒకప్పుడు ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ సాధించిన తెలుగుదేశం పార్టీ నేడు జిల్లా అధ్యక్షులు కావలెననే బోర్డు పెట్టుకునే స్థితికి దిగజారింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మకుటాయమానంగా తెలుగుదేశం జెండా ఎగురవేసిన ఆ పార్టీ నేడు జిల్లా అధ్యక్షులుగా సమర్థులను నియమించేందుకు లైట్లు పట్టుకు వెతుకుతోంది. వయసు ఉడిగిన నాయకులను పక్కన పెట్టి యువతరాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
శ్రీకాకుళంలో ‘కూన’కు అవకాశాలు
రాజకీయ చైతన్యానికి , తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పూర్వవైభవం సాధించాలి అంటే సమర్థుడైన జిల్లా అధ్యక్షుడు అవసరమని భావించిన టీడీపీ అధిష్టానం ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ను నియమించేందుకు యోచన చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి స్వయాన బావమరిది అయిన రవికుమార్ ఆమదాలవలసలో ఆయనతో ఢీ కొడుతున్నారు.
జగన్ ఆలోచనకు ముందే జైకొట్టిన చంద్రబాబు
రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవ్వనున్న కింజరాపు అచ్చెన్నాయుడుతో సత్ససంబంధాలు కలిగివున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విప్ గా చేయడంతో పాటు జిల్లా శ్రేణులతో మంచి సత్ససంబంధాలు కలిగివున్నారు. ముఖ్యంగా కళింగ సామాజిక వర్గానికి చెందడం ప్లస్ అయ్యే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాలో ఇది బలమైన సామాజిక వర్గమే కాకుండా , ఇటీవల ఆ వర్గం టీడీపీకి దూరమైనందున మళ్లీ దగ్గర చేసుకునేందుకు ‘కూన’ ఉపయోగపడే అవకాశముంది.
అదే సందర్భంలో జిల్లా అధ్యక్షునిగా ఈ సారి తటస్థులను ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్న అధిష్టానం ఆ దిశగా ఒకటి , రెండు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
విజయనగరంలో ‘కిమిడి’ కి ఛాన్స్
విజయనగరంలో పూర్వవైభవం కోల్పోయి , గత సాధారణ ఎన్నికల్లో డక్ ఔట్ అయిన టీడీపీ మళ్లీ పట్టుసాధించాలి అంటే జిల్లా అధ్యక్షుడుగా సరైన వ్యక్తి అవసరమని భావించి యువకుడు, మంచి వాక్పటిమ ఉన్న వ్యక్తి కిమిడి నాగార్జునను పట్టం కట్టే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తమ్ముడు కొడుకు, మాజీమంత్రి కిమిడి మృణాళిని తనయుడు , చీపురుపల్లిలో బొత్సను ఎదుర్కొనగల సమర్థుడు కావడం కలిసొచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుడిగా కళాను తప్పిస్తుండటంతో ఆ ఇంటి నుండి వేరొకరికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కూడా టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకోవడం నాగార్జున కు కలిసొచ్చింది. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుండి బొత్స పై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అక్కడేవుంటూ నాయకులతోను , కేడర్ తోను సత్ససంబంధాలు నెలకొల్పుకోవడం కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో కూడా బిసి తూర్పు కాపు కులానికి చెందిన వ్యక్తి అవ్వడం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేతరుణంలో టీడీపీ ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
విశాఖలో ‘బండారు’కు అందలం
కాబోయే రాష్ట్ర రాజధానిగా ఇప్పటికే ప్రాముఖ్యత సంతరించకున్న విశాఖపట్నంలో దీటైన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించే యోచనలో టీడీపీ ఉంది. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైసీపి గాలులు వీచినప్పటికీ అర్బన్ లో టిడిపి తన పట్టు నిరూపించుకుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించడంతో సీన్ మారిపోయింది. కొద్దిరోజుల క్రితం విశాఖ అర్భన్ అధ్యక్ష పదవికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రాజీనామా చేసారు.
కొడుకులిద్దరినీ అధికారికంగా వైసీపీలో చేర్పించిన ఆయన అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా చెలామణీ కానున్నారు. రూరల్ అధ్యక్షుడుగా ఉన్న పంచకర్ల తెలుగుదేశం పార్టీయే వద్దని వెళ్లిపోయారు. అందువల్ల ఇప్పుడు విశాఖలో టీడీపీకి నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని అధ్యక్షునిగా నియమించే యోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
సీనియర్ అయినందున నాయకులతోను , కేడర్ తోను సత్ససంబంధాలు ఉండటం , అర్బన్ లో మంచి పట్టు ఉండటం కలిసొచ్చే అవకాశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత మామ కావడం తద్వారా అచ్చెన్నకు దగ్గర బంధువు కావడం కలిసొచ్చే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. అలానే అనకాపల్లి, అరకు పార్లమెంట్ ప్రాంతాల్లో అధ్యక్షుల నియామకానికి కసరత్తు జరుగుతోంది.
టీడీపీ అధ్యక్ష స్థానాలకు పోటీ పడేస్థాయి నుండి ప్రస్తుతం అదో ముళ్ల కిరీటం అని భావించేస్థాయికి నాయకులు చేరడంతో అధిష్టానం ముమ్మర కసరత్తు చేయాల్సిరావడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తోంది.