కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరేందుకు వైసీపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో నేటికీ వారికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ సభ్యులు జై కొడుతూనే ఉన్నారు. త్రిబుల్ తలాక్ బిల్లు, ఎన్పీఆర్ బిల్లుల విషయంలో ఏపీలో పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నా వైసీపీ నేతలు రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మద్దతు పలికారు. దీంతో రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేకపోయినా బీజేపీ ప్రభుత్వం అనేక బిల్లులను పాస్ చేయగలుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఎన్డీయేలో చేరి కేంద్రంలో రెండు మంత్రి పదవులు పొందాలని వైసీపీ కీలక నేతలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది.
కేంద్ర బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది?
అనేక అవినీతి కేసుల్లో వైసీపీ అగ్రనేతలు 12 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మన దేశంలో అవినీతి కేసుల్లో విచారణకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే 7 సంవత్సరాల నుంచి వైసీపీ కీలక నేతలు బెయిల్ పై ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు, రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సంవత్సరంలోగా తేల్చడానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీని ఎన్డీయేలో చేర్చుకుంటే బీజేపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కోర్టు తీర్పులతో వైసీపీ నేతలు జైలు పాలయితే వారితో అంటకాగిన బీజేపీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు. దీని వల్ల వైసీపీ నేతలు వారి ప్రయోజనాలు నెరవేర్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని తెలుస్తోంది. అందుకే కేంద్రంలో మంత్రి పదవులు సాధించుకుంటే న్యాయవ్యవస్థను కూడా శాసించవచ్చనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.
‘‘ఎన్డీయేలో వైసీపీని చేర్చుకుంటున్నారా’’ అని ఓ టీడీపీ నేత బీజేపీ పెద్దలను సరదాగా అడగ్గా, అవినీతి బురదలో పొర్లుతున్న వారిని చేర్చుకోం అని కేంద్రంలో కీలక పదవిలో ఉన్న ఆ బీజేపీ నేత ఘాటుగానే చెప్పారట. ఇవన్నీ పరిశీలిస్తుంటే కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీని ఎన్డీయేలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీతో అంటకాగితే బీజేపీకే నష్టం
కేంద్రంలో బీజేపీకి ఎవరి మద్దతూ అవసరం లేదు. రాజ్యసభలో కూడా త్వరలో వారికి మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. వారికి లోపాయికారిగా మద్దతు పలికే సభ్యులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని ఎన్డీయేలో చేర్చుకుని వీరి అవినీతి ఆరోపణల బురదను అంటించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని తెలుస్తోంది. వైసీపీతో బీజేపీ నేతలు సమాన దూరం పాటించాలని కూడా ఆ పార్టీ నేతలు నర్మగర్భంగా చెప్పుకుంటున్నారట. వైసీపీకి కొమ్ముకాసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు బీజేపీ పెద్దలు తలంటారని తెలుస్తోంది. అందుకే ఆయన వాయిస్ మారింది.
హిందూ దేవాలయాల విషయంలో కొడాలి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి కొడాలిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీపై జీవీఎల్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి. అంటే, ఏపీ బీజేపీ నేతలు వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించాలో అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలే ఇచ్చిందని తెలుస్తోంది.
ఏపీలో పోరాటం, ఢిల్లీలో సహజీవనంతో బీజేపీ ఎదుగుతుందా?
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోవడంతో కేంద్రం సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. అంతర్వేధి రథం దహనం ఘటన జరగక ముందు వరకూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా వాయిస్ మార్చారు. చంద్రబాబును విమర్శిస్తే ప్రయోజనం శూన్యం. అందుకే వైసీపీపై పడ్డారు. హిందు సంఘాలు ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇక సోము వీర్రాజు వైసీపీపై పోరాటం ప్రారంభించారు. ఏపీలో బీజేపీతో పోరాడుతూ, వారిని కేంద్రంలో ఎన్డీయేలోకి తీసుకుంటే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళుతుంది. అందుకే ఎన్డీయేలో చేరాలన్న వైసీపీ నేతల కల నేరవేరకపోవచ్చు.











