ఏపీ కొత్త ఇసుక పాలసీ సిద్దమైంది. మంత్రివర్గ ఉపసంఘం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఇసుక పాలసీ విధానాలను అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఏపీలో ఇసుక ధర తక్కువే అయినా, రవాణా ఛార్జీల మోతతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దూరాన్ని బట్టి 10 టన్నుల ఇసుక ఏపీలో రూ.36 వేలు ఖర్చవుతోంది. వినియోదారుడికి రవాణా భారం తగ్గించడంతోపాటు ప్రభుత్వ ఆదాయం పెంచేదిగా ఇసుకపాలసీ రూపొందుతోందని తెలుస్తోంది.
ఉచితంగా ఇవ్వాలి, కానీ ఆదాయం రావాలి
ఇసుక రీచ్ లకు 8 కి.మీ పరిధిలో ఉండే గ్రామాలకు ఉచితంగా ఇసుక ఇవ్వనున్నారు. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఇసుక లారీలు, ట్రాక్టర్లు తిరగడం వల్ల ఏర్పడే అసౌకర్యాలను భరించినందుకు తాయిలంగా ఆ ప్రాంతంలో ఉచితంగా ఇసుక ఇవ్వనున్నారు. కానీ రవాణా ఛార్జీలు మాత్రం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అమలవుతున్న పాలసీ ప్రభుత్వాని కన్నా రవాణా కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. ఈ విధానానికి స్వస్తి పలికే విధంగా కొత్త పాలసీ తేనున్నారు. ముందుగా ఇసుకను రీచ్ ల నుంచి తరలించి డంపింగ్ యార్డులో పోయడం… ఆ తరవాత అక్కడ నుంచి మరలా తరలించడం ద్వారా రవాణా ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. రాబోయే కొత్త పాలసీలో డంపింగ్ యార్డులు ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
రాష్ట్రం మొత్తం ఒకరికే…
ఏపీ మొత్తం టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ఒకరికే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రీచ్ కు 8 కి.మీ పరిధిలో ఉచితంగా ఇసుక ఇవ్వడంతోపాటు, ఇసుక ధర మరికొంత పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకునే విధంగా కొత్త పాలసీ రూపకల్పన జరుతోందని తెలుస్తోంది.
కొత్త విధానం ద్వారా రీచ్ లో నేరుగా వినియోగదారుడు తెచ్చుకున్న వాహనంలో ఇసుక లోడింగ్ చేస్తారు. అంటే ఇసుక రవాణా ఛార్జీలు ఎంత అనేది వినియోగదారులు, వాహనదారులు నిర్ణయించుకుంటారు. తద్వారా ప్రభుత్వం రవాణా ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తుందనే ప్రచారానికి తెరవేయనున్నారు.
నిర్మాణరంగం కుదేలు…
మూడు రాజధానుల ప్రకటన, ఇసుక, సిమెంటు ధరల పెరుగుదలతో ఏపీలో నిర్మాణరంగం కుదేలైంది. ఈ రంగంలో ఆధారపడి జీవిస్తున్న 35 లక్షల మంది కూలీలు రోడ్డునపడ్డారు. దీంతో రోజువారీ కూలీలు పనులు దొరక్క ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది గ్రహించిన వైసీపీ నేతలు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇసుక ధరలు తగ్గించడం ద్వారా నిర్మాణరంగం పుంజుకునేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారని ఆశిద్దాం.











