కరోనా ఉదృతిలో అతలాకుతలమవుతున్న తెలంగాణలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం బయటికి వచ్చింది. పిల్లల రక్షణకు రెస్కూ ఆపరేషన్ లో పాల్గొన్న వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, సాధారణ సమయాల్లో జరిగే బాల్య వివాహాల కంటే కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ సమయంలో జరిగిన బాల్య వివాహాలు ఎక్కువని తెలపడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 10 రెట్లు ఎక్కువ బాల్య వివాహాలు రాష్ట్రంలో జరిగాయని వారు తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన పరిస్థితి ఆ తరువాత ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆంక్షల సమయంలో మునుపటి నెలలతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మైనర్లకు బాల్యవివాహాలు జరిగాయని రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఐదు నెలల వ్యవధిలో, డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు 597 మంది మైనర్లను కాపాడింది. వీరిలో 425 మందిని బాల్యవివాహాల నుంచి కాపాడగా 147 మంది బాల కార్మికులను రక్షించారు.
మార్చి 22 నుంచి ఆగస్టు చివరి మధ్య నమోదైన డేటా ప్రకారం, హైదరాబాద్‌లో 19 మందికి పైగా పిల్లలను కాపాడగా వారిలో 12 మందిని బాల్యవివాహాలు జరగకుండా కాపాడారు. ప్రతి సంవత్సరం 50 నుంచి 70 బాల్యవివాహాలు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. కానీ వాటి సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. ఎక్కువగా వికారాబాద్, వరంగల్ (రూరల్), మహబూబ్ నగర్ జిల్లాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని బచపన్ బచావో ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్త వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా తీవ్రతతో లొక్డౌన్ విధించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంరక్షణలో ఉన్న దాదాపు 13 వేల మంది పిల్లలను ఇంటికి పంపారు. ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేని 9 వేల మంది విద్యార్థుల తల్లి తండ్రులు పనికి పంపడం లేదా బాల్య వివాహాలు చేసేందుకు సిద్ద పడినట్లు అధికారులు గుర్తించారు.