టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏ విషయంలో చూసినా ఇతరులెవ్వరూ అందుకోలేని ఎత్తులో నిలబడ్డారు. ఇప్పటికే ఆయనకు ఏడు పదుల వయసు దాటింది. రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలకు పైగా సుదీర్గ అనుభవం ఆయన సొంతం. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లకు పైబడిన పాలనానుభవం సంపాదించారు. ఇంకో ఐదేళ్ల పాటూ సీఎంగానే ఉంటారు. మరోవైపు విపక్ష నేతగానూ 15 ఏళ్ల అనుభవాన్ని గడించారు. అయినా చంద్రబాబులో నూతనోత్తేజం తొణికిసలాడుతూనే ఉంటుంది. నిత్యం చలాకీగా, చతురోక్తులు సంధిస్తూ ఆయన సాగిపోతూ ఉంటారు. ఓ వైపు రాష్ట్ర పాలన, మరోవైపు టీడీపీ అధ్యక్షుడి హోదాలో పార్టీ నిర్వహణ… ఇంకోవైపు కూటమిలోని పార్టీలతో అనుసంధానం… ఇలా అన్నింటినీ ఆయన ఇంత పెద్ద వయసులోనూ అలా ఒంటి చేత్తో లాగించేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. బుధవారం నూతన సంవత్సరాది సందర్భంగా అమరావతిలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సందర్భంగా చంద్రబాబును చూస్తే… ఇవన్నీ జనంలో కలిగిన భావనలు.
మీడియాలో ఎలాంటి హడావిడి లేకుండా చంద్రబాబు చాలా సరదాగా గడిపారు. దాదాపుగా అన్ని అంశాలపై ఆయన తన మనసులోని భావాలను క్లిస్టర్ క్లియర్ గా వెల్లడించారు. సినిమా రంగం వంటి పలు కీలక రంగాలపైనా ఆయన డేరింగ్ కామెంట్లు చేశారు. సినిమాలతో మనకు ఇప్పుడు అంతగా అవసరం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అదే సమయంలో తెలుగు సినిమా రంగం సాధించిన పురోగతిని ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు… హైదరాబాద్ ను వీడి తెలుగు సినిమా రంగం బయటకు రాలేదన్న బావన వచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి హైదరాబాద్ హబ్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాలక్రమంలో తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ ను ఓ రేంజిలో పెంచుకుందని మెచ్చుకున్నారు. ఇలాంటి కీలక తరుణంలో దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదే ఫోకస్ పెట్టేలా సినీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కూడా చంద్రబాబు అన్నారు. ఫలితంగా టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న రచ్చను చంద్రబాబు తనదైన తెలివితో అలా పక్కనపెట్టేశారు.
ఇటు టీడీపీలోనే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో బీసీలకు ఇస్తున్న ప్రాదాన్యాన్ని కూడా చంద్రబాబు ఏమాత్రం సంకోచించకుండా ప్రస్తావించారు. పార్టీలో కీలక పదవులను బీసీలకు ఇచ్చామని చెప్పిన చంద్రబాబు.. బీసీల్లో సమర్థవంతమైన నేతలు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఈ కారణంగానే పార్టీ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వ పాలనలోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారులు సత్తా చూపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విజయానంద్ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు…పాలనలో సత్తా కలిగిన అధికారిగా విజయానంద్ ఎప్పుడో గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. విజయానంద్ లోని కాలిబరే ఆయనకు సీఎస్ పదవిని కట్టబెట్టిందని తెలిపారు.
ఇక వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్న వైనాన్ని చంద్రబాబు ఆసక్తికరంగా ప్రస్తావించారు. వైసీపీ మునిగిపోతున్న నావ అని ఆ పార్టీ నేతలు గుర్తించారని అన్నారు. ఈ కారణంగానే వారంతా వైసీపీని వీడి కూటమిలోని మూడు పార్టీల్లో చేరిపోతున్నారని తెలిపారు. ఇలా వస్తున్న కొందరు నేతల పట్ల కూటమి పార్టీల్లో ఓ రకమైన చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని… అయితే పొత్తులో ఉన్నందున ఇరత పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలను మిగిలిన పార్టీలు గౌరవించక తప్పదని తెలిపారు.
ఇక అంతిమంగా తాను ప్రస్తుతం ఎలా ఉంటున్నది… ప్రభుత్వ పాలనను ఎలా పర్యవేక్షిస్తున్న తీరును కూడా చంద్రబాబు ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అటు పార్టీలో అయినా…ఇటు ప్రభుత్వ పాలనలో అయినా… ఆయా స్థాయిలో జరుగుతున్న నిర్ణయాలను తాను క్రాస్ చెక్ చేస్తున్నానని ఆయన తెలిపారు. ఇందుకోసం తాను ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నానని ఆయన అన్నారు. తాను గతంలో మాదిరిగా ఇప్పుడు లేనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఏ విషయంలో అయినా అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నానని, ఆ తర్వాత వాటిని తన వ్యవస్థలోపెట్టి వాటిని మరింత లోతుగా పరిశీలిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత అంతిమంగా ఓ నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. ఫలితంగా మంచి ఫలితాలు వాటికవే వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.
మొత్తంగా అటు పార్టీ వ్యవహారాల్లో అయినా… ఇటు పాలనలో అయినా బెటర్ డెసిషన్స్ తీసుకుంటున్నానని… ఇది తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తోందని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. నూతన సంవత్సరాదిన మీడియాకు చంద్రబాబు తనలోని నూతన మనిషిని ఆవిష్కరించి వారిని ఆశ్చర్యానికి గురి చేశారు.