తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రోజుకో వివాదంతో రోడ్డున పడుతోంది. . తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాస అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, నిరంజన్ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. దీంతో సమావేశంలో ఉన్న సీనియర్లు కంగుతిన్నారు.
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే శ్రవణ్, నిరంజన్ నువ్వెంతంటే నువ్వెంత అంటూ అరుచుకున్నారు. సీనియర్ నాయకులంతా అక్కడే ఉన్నా అదేమీ పట్టించుకోకుండా వీరిద్దరు అరచుకోవడం పార్టీలో గందరరోళాన్ని తెలంగాణ సమాజానికి కళ్లకు కట్టింది.
ఇప్పుడు ఈ రాద్దాంతంపై ఏం చేయాలోని పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అదే సమావేశంలో ఉన్న సీనియర్ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో ప్రొటోకాల్ లేకుండా పోయిందని, క్రమశిక్షణ లోపించిందంటూ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాసోజ్ శ్రవణ్, నిరంజన్ రెడ్డిల వివాదం క్రమశిక్షణా సంఘం వద్దకు వెళ్లింది.
వీరిద్దరిలో ఎవరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇక్కడ మళ్లీ కులం కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. ఎవరి మీద ఎలాంటి చర్య తీసుకుంటే ఎవరి వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత, అనుకూలత వస్తుందో తెలియడం లేదని సీనియర్లు వాపోతున్నారు.
దాసోజు అధిష్టానం మనిషి.. మరి నిరంజన్..?
గాంధీభవన్ సాక్షిగా వాదులాడుకున్న దాసోజ్ శ్రవణ్, నిరంజన్ రెడ్డిలకు వారివారి స్థాయిలో పార్టీలో మంచి పలుకుబడి ఉంది. దాసోజు శ్రవణ్‌కు అధిష్టానం అండదండలున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ ప్రసంగాలకు తెలుగులో అనువాదం చేసిన దాసోజు అధిష్టానం దృష్టిలో పడ్డారు. అంతేకాదు ఎన్నికలు ముగిసిన తర్వాత దాసోజు శ్రవణ్ కు ఏఐసీసీలో అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు. దీంతో పాటు తెలంగాణాలో పార్టీలో ఏం జరుగుతోందో అధిష్టానానికి దాసోజు శ్రవణ్ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని కూడా అంటున్నారు. ఒక రకంగా ఆయన తెలంగాణకు అధిష్టానం నియమించిన అనధికార దూత అంటున్నారు. ఇలాంటప్పుడు దాసోజు శ్రవణ్ కు ఎలా నోటీసులు ఇవ్వగలరని కొందరంటున్నారు.
నిరంజన్… ఉత్తమ్ మనిషి..
వివాదంలో మరో నాయకుడు నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషనే ప్రచారం ఉంది. ఆయన అండ చూసుకునే నిరంజన్ రెడ్డి అ సమావేశంలో అంతలా మాట్లాడారని కూడా చెబుతున్నారు. ఒకవేళ నిరంజన్ రెడ్డికి ఒక్కరికే షోకాజ్ నోటీసు ఇస్తే ఆయన సామాజిక వర్గం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోననే భయం కూడా వెంటాడుతొందంటున్నారు.
ఇద్దరు నాయకులు వారివారి స్ధాయిల్లో పెద్ద వారు కావడంతో ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వాలో తెలియక క్రమశిక్షణ సంఘం సభ్యులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. పోనీ అని ఈసారికి వీరిద్దరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మిన్నకుంటే భవిష్యత్ లో మరికొందరు నాయకులు ఇలాగే ప్రవర్తిస్తే అప్పుడు కూడా వారికి నోటీసులు ఇవ్వలేం కదా అని మరికొందరి వాదన. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాక సమావేశం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిందంటున్నారు. అధికారం కూడా లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని అందరూ నవ్వుకుంటున్నారు.