దేశవ్యాప్తంగా ఉండే అన్నదాతల్లో భయాందోళనలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. సుమారు 50 రోజులుగా ఈ చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతలు సాధించిన తొలి విజయంగా ఈ తీర్పును పలువురు అభివర్ణిస్తున్నారు. తదుపరి విచారణలు కూడా పూర్తయి తుది తీర్పు వచ్చే వరకు ఈ చట్టాల అమలును సుప్రీం కోర్టు ఆపేసింది.
సోమవారం నాటి విచారణలో.. తక్షణం రైతుల సమస్యను పరిష్కరించేలా ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అసమర్థతను సుప్రీం తప్పుపట్టింది. అదే సమయంలో- మీకు చేతకాకపోతే.. మేం చర్యలు తీసుకుంటాం అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే.. కేంద్ర తరఫున న్యాయవాది మాత్రం.. దయచేసి స్టే విధించవద్దని కోర్టుకు విన్నవించడం జరిగింది.
అయితే మంగళవారం నాటికి ఆ విన్నపాలు ఫలించలేదు. ఒకవైపు సుప్రీం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నలుగురు సభ్యుల కమిటీలో అశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధావంత్ లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అటు రైతు సంఘాల ప్రతినిధులు, ఇటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. అనంతరం కమిటీ సుప్రీం కోర్టుకే నివేదిక ఇస్తుంది.
రైతులు యాభై రోజులుగా చేస్తున్న ఆందోళనలకు సంబంధించి కేంద్రం కోర్టు ఎదుట వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీం తోసిపుచ్చింది.
Must Read ;- ఇందూరు పసుపు రైతుల నిరసన..ఢిల్లీ రైతు ఉద్యమంగా మారబోతోందా?











