ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సరికొత్త వివాదాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజిలో సాగుతున్నా.. ఇప్పటిదాకా ఒకటి అరా మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా వైసీపీకే కాకుండా.. అన్ని రాజకీయ పార్టీలకు కీలక జిల్లాగా పరిగణిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య నెలొకన్న వివాదం పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. యువ నేతలుగా ఉన్న వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో కలవరాన్ని రేపుతున్నారు. ఒకరంటే మరొకరికి పడని రీతిలో సాగుతున్న వీరి పోరు.. రెండు రోజులుగా ఏపీలో వైరల్ గా మారిపోయింది. పార్టీ అధిష్ఠానాన్ని కూడా వీరి పోరు అయోమయంలో పడేసిందనే చెప్పాలి.
రాజాపై మార్గాని ఫైరింగ్
సోమవారం నాడు తనపై ఆరోపణలు గుప్పించిన జక్కంపూడి రాజాపై ఆ మరునాడే.. అంటే మంగళవారం నాడే మార్గాని భరత్ రామ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం పెట్టి మరీ మార్గాని సంధించిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భంగా మార్గాని ఏమన్నారంటే.. ‘‘క్రమశిక్షణ, అంకితభావంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ నా పైన నమ్మకంతో ఎంపీ గా అవకాశం ఇచ్చారు. నా తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలు. కొంతమంది కుహనా నాయకులు నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టిడిపి నేత బుచ్చయ్య నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలి. నీలా నేను చీకటి రాజకీయాలు చెయ్యను. నువ్వు చేసే ప్రతిదీ స్కూల్ కి వెళ్లే పిల్లవాడిని అడిగితే చెబుతాడు. మాజీ జేడి లక్ష్మీనారాయణతో ఒక ప్రోగ్రాం లో మాత్రమే కలిశాను. నేను సెల్ఫీ దిగితే ఫూటేజ్ చెక్ చేసుకోండి. ఆ సందర్భంలో సీఎం జగన్ పరిపాలనను జేడి ప్రశంసించారు. ట్రిపుర్ ఆర్ లా నాకు నీచ రాజకీయాల రావు. చెయ్యను కూడా. నన్ను రఘురామకృష్ణంరాజు తో పోల్చడం సిగ్గు చేటు. గతంలో ఎంపీలు కనపడట్లేదని వార్తలు వేశారు. నేను సోషల్ మీడియాలో కనిపోస్తున్నాని నామీద పడుతున్నారు. రాష్ట్రపతి ప్రధానులకు ఫోన్ చేసి ఆయన ఏ బాషలో మాట్లాడతారో ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆయన చిటికేస్తే రాజమండ్రిలో వచ్చేది బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు, గంజాయి బ్యాచ్ మాత్రమే. నేను పార్టీ గీసిన లక్ష్మణ గీత దాటను. నువ్వు నీ పరిధిలో ఉంటే మంచిది. లెదంటే రెండు రాష్ట్రాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా. నీలాగే నేను కూడా కిడ్ లా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఉండదు. నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంతెంత నిధులు తెచ్చి అభివృద్ధి చేశానో లెక్కలు చూసుకో’’ అంటూ మార్గాని ఓ రేంజిలో ఫైరయ్యారు.
అసలు వీళ్ల గోలకు కారణమేంటి?
జక్కంపూడి ఫ్యామిలీ ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలగుతూ వస్తోంది. జక్కంపూడి రాజా తండ్రి రామ్మోహన్ రావు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కూడా పని చేశారు. రామ్మోహన్ రావు మృతి తర్వాత ఆయన సతీమణి విజయలక్ష్మి కూడా వైఎస్ ఫ్యామిలీకి మరింత సన్నిహితంగా మెలగింది. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ వైసీపీ పెడితే.. వైఎస్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో జక్కంపూడి ఫ్యామిలీ వైసీపీలో చేరిపోయింది. తన తండ్రి మాదిరే జగన్ కూడా జక్కంపూడి ఫ్యామిలీకి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. కుర్రోడైనా జక్కంపూడి రాజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటుగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం ఎంపీగా విజయం సాధించారు. ఓ ఎంపీగా గెలిచిన తర్వాత మార్గాని దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మార్గాని.. పనితీరులోనూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వ్యక్తిగతంలో గొడవలు ఉన్నాయో, లేదో తెలియదు గానీ.. పార్టీలో ఎదుగుదలకు సంబంధించి ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ సాగుతున్న నేపథ్యంలోనే రచ్చ మొదలైనట్లుగా సమాచారం.
Must Read ;- టీడీపీ యువ సత్తాను ఆపతరమా?











