కరోనా సెకండ్ వేవ్ చిత్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏంజరుగుతోంది? పాలకులు పట్టించుకోవడం లేదు. కోట్లు వెనకేసుకున్నవారు వ్యాక్సిన్ లు వేయించేసుకుని గదుల్లో కులుకుతున్నారన్న అపనిందలు మూటగట్టుకుంటున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ఎక్కడా కనిపించడం లేదు. షూటింగులు జరగడం లేదు.. సినీ కార్మికుల పొయ్యిలో పిల్లి లేవడం లేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా సినీ జీవులకు కష్టాలే. తమను ఎవరు ఆదుకుంటారో ఎవరికీ ఆర్థంగావడం లేదు.
కరోనా మొదటి వేవ్ లో ఆకలి బాధలైతే ఇప్పుడు ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. కరోనాతో ఆస్పత్రి పాలైతే లక్షలకు లక్షలే దోచేస్తున్నారు. పిల్లి మెడలో గంట కట్టే వారి కోసం ఎదురుచూస్తున్నట్టుంది. సినిమా పరిశ్రమ అంటేనే హీరోల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది మన హీరోలు ఈ విషయంలో ఏమీ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పొరుగున ఉన్న తమిళనాడులో హీరో సూర్య కుటుంబం, సూపర్ స్టార్ రజినీ కుటుంబం, హీరో జయం రవి కుటుంబం తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు.
తెలుగులో ఇంకా ఈ ప్రక్రియ ఏమీ మొదలు కాలేదు. ఇక్కడ 24 వృత్తుల వారు ఉంటే రెండు మూడు విభాగాల వారు తప్ప ఎవరూ స్పందించడం లేదు. డ్యాన్సర్స్ ను ఆదుకునేందుకు ఆ యూనియన్ కొంత నడుం కట్టింది. అవసరమైన వారికి నిత్యావసరాలు ఇస్తామంటూ ప్రకటించారు. పోనీ ఎవరికి వారు సొంతూళ్లకు వెళ్లిపోదామా అంటే ఈ లాక్ డౌన్ వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. ఓ పక్క సోనూ సూద్ లాంటి విలన్ పాత్రధారి తనదైన రీతిలో స్పందిస్తుంటే హీరోలు మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటున్నారన్న ఆరోపణలు సినీ జనుల నుంచి వస్తున్నాయి.
ఎవరికీ వ్యాక్సిన్ లు కూడా సరిగా వేయించలేకపోయారు. కనీసం వ్యాక్సిన్ వేయించుకుని ఉన్నా ప్రాణాలు కాపాడుకోగలిగే వాళ్లం, ఇప్పుడు కరోనా వస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ సినీ కార్మికులు వాపోతున్నారు. ఊళ్లో ఉన్న కొద్దో గొప్పో ఆస్తుల్ని కరిగించుకుని జనం కాలం వెళ్లదీస్తున్నారు. తమను ఎవరూ ఆదుకోకపోతే కరోనాతో కాకుండా ఆకలితోనే తమ ప్రాణాలు పోతాయని తల్లడిల్లుతున్నారు. సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగినా అది అంసంపూర్తిగానే ముగిసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎంత వేగంగా స్పందిస్తే అంత మంచింది. అంతేగాని మీనమేషాలు లెక్కిస్తూ పోతే అసలుకే మోసం వస్తుందన్న సంగతిని సినీ పెద్దలు మరచిపోతున్నారు. పోనీ ప్రభుత్వ పరంగానైనా ఏమైనా సహాయం అందితే కొంతలో కొంత ఊపిరిపీల్చుకోగలుగుతారు. తమ కష్టాలను తమలోనే దిగమింగుకుని ఈ సినీ జనం బతుకు వెళ్లదీస్తున్నారు.
Must Read ;- కరోనాను లెక్క చేయకుండా షూటింగులో బాలయ్య











